కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఫ్రెంచ్ ఓపెన్.. ఈ ఏడాది సెప్టెంబరు 20 నుంచి నిర్వహించనున్నారు. అయితే ఈ టోర్నీ మ్యాచ్‌లను వీక్షించేందుకు స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించనున్నారట. కొన్ని నిబంధనలతో ఈ అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య అధ్యక్షుడు జీన్ ఫ్రాంకోయిస్.
వీక్షకులు లేకుండా టోర్నీ నిర్వహించాలని అనుకోవట్లేదని జీన్ తెలిపారు. వారు లేకుండా జరిపితే, ఆసక్తితో పాటు ఆదాయం ఉండదని భావిస్తున్నట్లు చెప్పారు. 15 రోజుల పాటు జరగనున్న ఈ ఈవెంట్లో భౌతిక దూరం భాగం కానుంది. మీడియా సంస్థలను పరిమితంగానే ఆహ్వానిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటికే జూన్ 7న జరగాల్సిన ఈ టోర్నీని రద్దు చేసి టికెట్ డబ్బులను రీఫండ్ చేశారు. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్లోని ఓ మ్యాచ్కు ఏకంగా 5 లక్షల 20 వేల మంది హాజరు కావడం విశేషం.