ఇంగ్లాండ్ యువ టెన్నిస్ క్రీడాకారిణి ఎమ్మా రాడుకా(Emma Raducanu US Open)ను సంచలనం సృష్టించింది. యూఎస్ ఓపెన్‌లో(US Open 2021) మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్స్‌కు దూసుకెళ్లిన పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. 17వ సీడ్ గ్రీస్ క్రీడాకారిణి మారియా సక్కారీపై 6-1, 6-4 తేడాతో సెమీఫైనల్స్‌లో గెలిచిన ఎమ్మా ఈ ఘనత సాధించింది. దీంతో 17 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన పిన్న వయస్కురాలిగానూ రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు ప్రముఖ క్రీడాకారిణి మారియా షరపోవా 2004లో 17 ఏళ్ల వయసులోనే వింబుల్డన్ టైటిల్ గెలవడం గమనార్హం.
ప్రస్తుతం 150వ ర్యాంకులో కొనసాగుతున్న ఎమ్మా.. ఫైనల్స్‌లో కెనడా క్రీడాకారిణి లెయ్‌లా ఫెర్నాండెజ్(19)తో అమీతుమీ(Emma Raducanu Vs Leylah Fernandez) తేల్చుకోనుంది. మరోవైపు ఆమె ఈ మ్యాచ్‌లో మారియాను ఓడించిన వీడియోను యూఎస్ ఓపెన్ టెన్నిస్ ట్విటర్‌లో పంచుకుంది. అందులో ఈ బ్రిటన్ చిన్నది సాధించిన విజయాన్ని తనను తానే నమ్మలేకపోయింది. చివరిపాయింట్ సాధించాక కాసేపు తలను పట్టుకొని అలాగే నిశ్శబ్దంగా ఉండిపోయింది.
మ్యాచ్ అనంతరం ఎమ్మా రాడుకాను మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేసింది. తాను ఫైనల్‌కు చేరానంటే నమ్మలేకపోతున్నానని చెప్పింది. తనపై ఒత్తిడి లేదని, తుదిపోరులో మంచి ప్రదర్శన చేస్తానని తెలిపింది. మరోవైపు రెండు దశాబ్దాల తర్వాత ఇద్దరు టీనేజీ క్రీడాకారిణులు మహిళల గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో పోటీపడనుండటం విశేషం. 1999లో 17 ఏళ్ల సెరీనా విలియమ్స్ మార్టినా హింగిస్ అనే 18 ఏళ్ల క్రీడాకారిణితో పోటీపడి ఓడించింది.
ఇదీ చూడండి.. US Open 2021: ఎదురులేని జకోవిచ్- జ్వెరెవ్, సకారి ముందంజ