Peng Shuai U-Turn: చైనీస్ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయి యూటర్న్ తీసుకుంది. గతనెల ఆమె సామాజిక మాధ్యమాల్లో చైనా మాజీ వైస్ ప్రీమియర్‌పై లైంగిక దాడి ఆరోపణలు చేసింది. కాసేపటికే వాటిని తొలగించింది. తర్వాత ఆమె అదృశ్యం కావడం వల్ల పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. ఈ విషయంలో అంతర్జాతీయ టెన్నిస్ స్టార్లు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ వీడియోలో మాట్లాడిన పెంగ్.. తాను అసలు ఎవరిపై ఆరోపణలు చేయలేదని చెప్పింది. అందుకు సంబంధించిన వార్తను సింగపూర్‌కు చెందిన ఓ ప్రముఖ చైనా దినపత్రిక ప్రచురించింది.
"నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా. నేనెప్పుడూ ఎవరిపై లైంగిక వేధింపుల ఆరోపణలు, ఫిర్యాదులు చేయలేదు. ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నా" అని పెంగ్ అందులో వివరించింది.
అయితే, నవంబర్ 2న ఆమె సామాజిక మాధ్యమాల్లోనే.. చైనా మాజీ వైస్ ప్రీమియర్ జాంగ్ గవోలీపై చేసిన వ్యాఖ్యలు పై ప్రశ్నించగా .. అది తన వ్యక్తిగత విషయమని చెప్పింది. దాన్ని ప్రజలంతా తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపింది. అయితే.. ఈ విషయంపై పూర్తి సమాచారం ఇవ్వలేదు.
అలాగే ఆ పోస్టు అనంతరం పెంగ్ బాహ్య ప్రపంచానికి కనపడకుండా పోయేసరికి చైనాకు చెందిన ఓ అధికారిక పత్రిక.. ఆమె క్షేమంగానే ఉన్నట్లు డబ్ల్యూటీఏ చీఫ్ స్టీవ్ సైమన్‌కు ఈమెయిల్ చేశారు. దీనిపై అప్పట్లో స్టీవ్ అనుమానం వ్యక్తం చేశారు. ఆమె ఈమెయిల్ స్క్రీన్‌షాట్లను వీడియోలో చూపించగా.. అది తాను స్వయంగా రాసిందేనని తాజాగా పెంగ్ చెప్పింది. ఆ సమయంలో పెంగ్ కనపడకపోవడంపై ఏమైనా కారణం ఉందా అని వీడియోలో ఒక వ్యక్తి ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని, తాను ఎప్పుడూ స్వేచ్ఛగానే ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అలాగే ఈ వీడియోలో ఆమె చైనీస్ బాస్కెట్ బాల్ స్టార్ ప్లేయర్ యోమింగ్‌తో కలిసి మాట్లాడినట్లు కూడా కనిపించింది.