పనిభారం కారణంగా టీ20 కెప్టెన్సీ(virat kohli captaincy news) నుంచి వైదొలగుతున్నట్లు కోహ్లీ ప్రకటించినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. అయితే టెస్టులు, వన్డేల్లో భారత జట్టును నడిపించేది విరాటే కదా అని అభిమానులు సర్దుకున్నారు. నిజానికి కోహ్లీ నాయకత్వానికి పోటీ లేకపోయినా.. భిన్న సారథులు ఉండాలన్న చర్చ మొదలవకపోయినా ధోనీ బాటలోనే అతనూ నడిచాడు. గౌరవపూర్వకంగా టీ20 సారథ్య బాధ్యతల అప్పగింతకు ముందుకొచ్చాడు. ఇదంతా ఐపీఎల్ యూఏఈ దశకు మూడు రోజుల ముందు సంగతి. ఆ తర్వాత ఐపీఎల్ పూర్తయింది. పొట్టి కప్పు(t20 world cup 2021)లో భారత్ పోరాటం కూడా ముగిసింది. సూపర్ 12 దశలోనే జట్టు ఇంటిముఖం పట్టింది. టీ20 కప్పులో జట్టు వైఫల్యం నేపథ్యంలో పరిస్థితుల్లో చాలా మార్పొచ్చింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడటం.. కనీసం సెమీస్ చేరకపోవడం ప్రతి ఒక్క అభిమానిని తీవ్ర నిరాశకు గురిచేసింది. కోహ్లీ ఇంకాస్త ముందుగానే వైదొలగి ఉంటే బాగుండేదన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. పొట్టి కప్పులో జట్టు వైఫల్య ప్రభావం కోహ్లీ(virat kohli captaincy news) వన్డే సారథ్యంపైనా పడుతుందా? అన్న చర్చ ఇప్పుడు మొదలైంది.
కోహ్లీ దారెటు?
రానున్న రెండేళ్లలో రెండు ప్రపంచకప్(t20 world cup 2021)లు జరుగనున్నాయి. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్(t20 world cup 2022)కు ఆతిథ్యమివ్వనుంది. 2023లో వన్డే ప్రపంచకప్(odi world cup 2023) భారత్‌లో నిర్వహిస్తారు. సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు నాయకత్వం వహించాలని.. జట్టును విజేతగా నిలపాలని కోహ్లీ కోరుకుంటాడనడంలో సందేహం లేదు. కానీ బయో బబుల్ వాతావరణం ఆటగాళ్లను మానసికంగా దెబ్బతీస్తుంది. తాజా ప్రపంచకప్పులో టీమ్‌ఇండియా ప్రదర్శనే ఇందుకు నిదర్శనం. ఐపీఎల్(ipl 2021 news)లో సత్తాచాటిన భారత ఆటగాళ్లు విశ్వవేదికపై పూర్తిగా తేలిపోయారు. ఈ నేపథ్యంలో సారథ్య ప్రభావం బ్యాటింగ్‌పై పడకుండా టీ20 జట్టు పగ్గాలు విడిచిపెట్టిన కోహ్లీ.. రానున్న రోజుల్లో వన్డే కెప్టెన్సీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది ఆసక్తికరం. 2014లో పగ్గాలు చేపట్టిన కోహ్లీ.. జట్టును మరోస్థాయికి తీసుకెళ్లాడు. ఆటగాళ్ల ఫిట్‌నెస్, దృక్పథంలో ఎంతో మార్పు తీసుకొచ్చాడు. గత ఏడేళ్లలో టెస్టుల్లో భారత్ ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది.
లక్ష్యం 2023 ప్రపంచకప్
కెప్టెన్‌గా, ఆటగాడిగా కోహ్లీ అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పాడు. అయితే టెస్టుల మాదిరే వన్డేల్లో టీమ్‌ఇండియా విజయవంతమైందా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేం! 2019 ప్రపంచకప్(odi world cup 2019)లో భారత జట్టు సెమీస్‌లో ఓడింది. వన్డేల్లో బ్యాటర్‌గా కోహ్లీకి మంచి రికార్డే ఉన్నా.. కెప్టెన్‌గా అద్భుతమైన ఘనతలేమీ లేవు. సారథ్యం, బయో బబుల్ వాతావరణం తన బ్యాటింగ్‌పై ప్రభావం చూపుతుందని టీ20 కెప్టెన్సీ వదులుకున్న కోహ్లీ.. వన్డే సారథ్యం నుంచి కూడా తప్పుకోవాల్సి వస్తుందేమోనన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. భారత్‌లో 2023 వన్డే ప్రపంచకప్(odi world cup 2023) నేపథ్యంలో కొత్త కెప్టెన్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తే కోహ్లీ పరిమిత ఓవర్ల సారథ్యం నుంచి పూర్తిగా పక్కకు తప్పుకోవచ్చు. అయితే అతడి టెస్టు కెప్టెన్సీకి మాత్రం.. వచ్చే టెస్టు ఛాంపియన్‌షిప్ వరకు ఎలాంటి ప్రమాదం, పోటీ లేవు.
ఇక రోహిత్ చూసుకుంటాడు
"టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు దక్కిన గౌరవం. కానీ ఇప్పుడు పగ్గాలు వదిలేసి ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడిక ఈ జట్టును ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తర్వాతి కెప్టెన్‌దే. అందుకు రోహిత్ ఉన్నాడు. టీ20ల్లో కెప్టెన్‌గా తప్పుకున్నంత మాత్రాన నా ఆటలో తీవ్రత తగ్గిపోదు. ఒకవేళ అలా ఆడలేకపోతే అప్పటి నుంచే క్రికెట్ మానేస్తా. నేను కెప్టెన్ కాకముందు కూడా ఆటపైనే ధ్యాస పెట్టా" అంటూ నమీబియాతో మ్యాచ్‌కు ముందు మాట్లాడాడు కోహ్లీ.