టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు (నవంబర్ 3) అఫ్గానిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది టీమ్ఇండియా. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓడిన కోహ్లీసేన దాదాపు సెమీస్ ఆశల్ని వదులుకుంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిచి కొద్దిగా ఊరట కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ సీనియర్ స్పిన్నర్ రవి అశ్విన్‌ను ఆడించలేదు. అతడి స్థానంలో యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకున్నారు. ఇతడు పెద్దగా ప్రభావం చూపించలేకపోవడం వల్ల అశ్విన్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు మాజీలు. ఇదే విషయంపై స్పందించిన మాజీ క్రికెటర్ గావస్కర్.. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలని సూచించాడు.
"ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగితే పోయేదేమీ లేదు. ఇద్దరు సీమర్లు, ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలి. హార్దిక్ ఎలాగూ 2 ఓవర్లు వేయగలడు. అందువల్ల మరో ముగ్గురు పేసర్లతో బరిలో దిగడం వల్ల ఉపయోగం ఉండదు. అశ్విన్ లాంటి అత్యుత్తమ స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకోవాలి. అతడు లెఫ్టార్మ్ స్పిన్నరా? రైట్ ఆర్మ్ స్పిన్నరా? అన్నది ప్రశ్న కాదు. అతడి గణాంకాలు ఎలా ఉన్నాయో చూడండి."
-గావస్కర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
అబుదాబి వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే పాక్, కివీస్ చేతిలో ఓడిన భారత్.. ఈ మ్యాచ్‌లో గెలిచి గెలుపు బాట పట్టాలని చూస్తోంది.