ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన న్యూజిలాండ్ టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) దుమ్మురేపుతోంది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మినహా మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సెమీస్‌కు దూసుకొచ్చింది. ఇందులో బలమైన ఇంగ్లాండ్‌ని ఢీ కొట్టి చిత్తు చిత్తుగా ఓడించి పొట్టి ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) తొలిసారి ఫైనల్‌కు చేరింది. అయితే, 2016 టీ20 ప్రపంచకప్ సెమీస్, 2019 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్.. ఇంగ్లాండ్ చేతిలో ఓడింది. ప్రస్తుతం సాధించిన విజయంతో ఆ ఓటములకు ప్రతీకారం తీర్చుకుంది కివీస్.
అయితే, ఈ మ్యాచ్‌లో 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 16 ఓవర్లు ముగిసే సరికి 107/4 నిలిచింది. ఇలాంటి స్థితిలో ఓపెనర్ డారిల్ మిచెల్ (72), జిమ్మీ నీషమ్ (27) వీరోచిత ఇన్నింగ్స్‌లు (T20 World Cup 2021) ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇంగ్లాండ్‌ని ఓడించి ఫైనల్‌లోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్ జట్టుపై ప్రస్తుత క్రికెటర్లతోపాటు మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెందూల్కర్, పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్, భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, మాజీ ఆటగాళ్లు వీవీఎస్ లక్ష్మణ్, ఇర్ఫాన్ పఠాన్, వసీమ్ జాఫర్, ఆకాశ్ చోప్రా, అజిత్ అగార్కర్‌తోపాటు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ న్యూజిలాండ్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌లు చేశారు.
'క్రికెట్‌లో అద్భుతమైన మ్యాచ్. న్యూజిలాండ్ మ్యాచ్ గెలవడం సహా మరోసారి హృదయాలను గెలుచుకుంది. కాన్వే, నీషమ్‌ల సహకారంతో మిచెల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బౌండరీ లైన్ వద్ద బెయిర్ స్టో చేసిన ఫీల్డింగ్.. 2019 ఫైనల్స్‌లో బౌల్ట్ ఫీల్డింగ్‌ని నాకు గుర్తు చేసింది' అని సచిన్ తెందూల్కర్ ట్వీట్ చేయగా.. 'ప్రపంచకప్‌లో ఇది బెస్ట్ మ్యాచ్. డారిల్ మిచెల్ వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. జిమ్మీ నీషమ్ గేమ్ ఛేంజర్. న్యూజిలాండ్ అంటేనే సంచలనం. ఫైనల్స్‌కి చేరిన న్యూజిలాండ్‌కి శుభాకాంక్షలు' అని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. మిగతా ఆటగాళ్లు చేసిన ట్వీట్‌లను కూడా చూసేయండి.
ఇదీ చూడండి : 'న్యూజిలాండ్ జట్టు విజయాలకు కారణం అతడే'