సాగర్ రాణా హత్య కేసు నుంచి రెజ్లర్ సుశీల్ కుమార్ బయటపడే అవకాశాలు సంక్లిష్టంగానే ఉన్నాయి. ప్రస్తుతం అతడు రిమాండులో ఉన్నాడు. పోలీసులు సోమవారం అతడిని నాలుగు గంటలు ప్రత్యేకంగా విచారించారని తెలిసింది. రాణాపై దాడి చేసేందుకు పురిగొల్పిన పరిస్థితులు, దాడి చేసిన తీరు, ఆ తర్వాత ఎక్కడెక్కడ తిరిగాడో అతడి నుంచి తెలుసుకున్నారని సమాచారం.
లాకప్‌లో ఉన్న సుశీల్ రాత్రంతా ఏడ్చాడని వినికిడి. అతడు నిద్ర పోలేదట! భోజనం చేసేందుకూ నిరాకరించాడని తెలిసింది. వాస్తవంగా సాగర్ రాణాను భయపెట్టేందుకే దాడి చేశామని అతడు చెప్పినట్టు సమాచారం. దాడి జరిగిన తర్వాత తాను ఛత్రసాల్ స్టేడియంలోనే ఉన్నానని, చనిపోయాడని తెలియడం వల్ల పారిపోయానని చెప్పాడట. అతడికి సహకరించిన వారినీ పోలీసులు విచారించడం గమనార్హం. పారిపోయాక తలదాచుకొనేందుకు గ్యాంగ్‌స్టర్ల సహకారం తీసుకున్నాడని తెలియడం వల్ల వారెవరో తెలుసుకొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం సుశీల్‌ను పోలీసులు ఛత్రసాల్ స్టేడియానికి తీసుకెళ్లారు. నేరం జరిగిన సన్నివేశాన్ని రీక్రియేట్ చేశారు.
దేశం గర్వించే విధంగా ఎదిగిన సుశీల్ ఇలా హత్యానేరంలో నిందితుడుగా మారడం వల్ల రెజ్లింగ్ వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. ఉద్యోగం నుంచి అతడిని సస్పెండ్ చేసేందుకు ఉత్తర రైల్వే ఇప్పటికే చర్యలు మొదలుపెట్టింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అతడికి ఇచ్చిన పద్మపురస్కారాలను వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. మరికొన్నాళ్లు ఆగి పరిస్థితులను ఆధారంగా చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: సుశీల్‌ను ఉరి తీయాలి: సాగర్ తల్లిదండ్రులు