కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఒలింపిక్స్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ టోర్నీ రద్దు చేయటం కుదరదని.. వాయిదాపై త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ తెలిపారు. ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనబోమని ఇప్పటికే కెనడా ప్రకటించగా.. ఇప్పుడదే దారిలో ఆస్ట్రేలియా వెళ్లింది. ప్రపంచమంతా కరోనా బారిన పడిన క్రమంలో ఒలింపిక్స్ నిర్వహించినా.. తాము అందులో పాల్గొనబోమని స్పష్టం చేసింది. దీనిపై సోమవారం ఆస్ట్రేలియా ఒలింపిక్ కమిటీ(ఏఓసీ) ఏకగ్రీవ తీర్మానం చేసింది.
భారత్ మాత్రం జరుగుతోన్న పరిణామాలను పరిశీస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒలింపిక్స్లో పాల్గొనే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) వెల్లడించింది.
"ఒలింపిక్స్లో పాల్గొనే అంశంపై క్రీడామంత్రిత్వ శాఖ అనుమతితో మరో 4 లేదా 5 వారాల్లో నిర్ణయానికి వస్తాం. ఎందుకంటే మిగిలిన దేశాలతో పోలిస్తే ప్రస్తుతం మన దేశ పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది."
- రాజీవ్ మెహతా, ఐఓఏ సెక్రటరీ జనరల్
కొవిడ్-19 వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14 వేల మంది మరణించగా.. 3 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. భారత్లో ఇప్పటివరకు 415 మందికి వైరస్ సోకగా.. ఏడుగురు మృత్యువాత పడ్డారు.
ఇదీ చూడండి.. కరోనా ఎఫెక్ట్: ప్రపంచకప్-2020 రద్దు