Commonwealth Games 2022: మరో రోజులో బర్మింగ్హమ్ వేదికగా ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభంకానున్నాయి. 72 దేశాలు, 25 రకాల క్రీడాలు.. ఐదు వేల మందికిపైగా అథ్లెట్లతో నిర్వహించబోతున్న ఈ మాహా క్రీడామేళా కోసం ఇప్పటికే పలు దేశాలు అక్కడికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ క్రీడలు ఎప్పుడు మొదలయ్యాయి? ఆ పేరెలా వచ్చింది? ఈ గేమ్స్‌లో అత్యధిక పతకాలు గెలిచిన దేశం ఏంటి? తదితర ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం...
పేరు అలా వచ్చింది.. ప్రపంచంలోని చాలా దేశాలు బ్రిటన్ పాలనలో ఉండేవి. ఆ దేశాలను అప్పుడు బ్రిటీష్ ఎంపైర్(సామ్రాజ్యం) అనేవారు. ఆ తర్వాత అవి స్వతంత్ర దేశాలుగా మారాయి. వాటినే నేడు కామన్వెల్త్ దేశాలుగా పిలుస్తున్నారు. ఆ జాబితాలో ప్రస్తుతం 53 దేశాలున్నాయి. కానీ ఈ కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనబోయే దేశాలు 72.
అప్పుడు ప్రారంభయ్యాయి.. ఈ మెగా క్రీడలు 1930లో తొలిసారిగా ప్రారంభమయ్యాయి. మొదటిసారి హామిల్టన్ నగరంలో నిర్వహించారు. అప్పుడు అప్పుడు మొత్తం 11 దేశాల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియా, బెర్ముడా, బ్రిటీష్ గయానా, కెనడా, ఇంగ్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, సౌత్ ఆఫ్రికా, వేల్స్ ఇందులో పాల్గొన్నాయి.
- తొలి సారి జరిగిన పోటీల్లో ఆరు క్రీడాంశాలను మాత్రమే చేర్చాచు. అథ్లెటిక్స్, బాక్సింగ్, లాన్ బౌల్స్, రోయింగ్, స్విమ్మింగ్ అండ్ డైవింగ్, రెజ్లింగ్.
- కెనడాకు చెందిన ట్రిపుల్ జంపర్ గోర్డాన్ స్మాల్కోంబ్.. ఈ గేమ్స్‌లో తొలిసారి స్వర్ణం గెలిచాడు.
- ప్రతి నాలుగేళ్లకు ఓ సారి జరిగే ఈ కామన్వెల్త్ క్రీడలు 1942,1946లో నిర్వహించలేదు. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా వాయిదా వేశారు. ఆ తర్వాత నుంచి వాయిదా వేయకుండా నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ సారి జరగబోయేది 22వ కామన్వెల్త్ గేమ్స్.
- భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2010 లో కామన్వెల్త్ క్రీడలను నిర్వహించారు. దేశ రాజధాని దిల్లీలో జరిగిన ఆ క్రీడల్లో 71 దేశాల నుంచి 6,081 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
గతంలో ఈ పేర్లతో పిలిచేవారు..
- 1930 నుంచి 1950 వరకు బ్రిటీష్ ఎంపైర్ గేమ్స్
- 1954 నుంచి 1966 వరకు బ్రిటీష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ గేమ్స్
- 1970 నుంచి 1974 వరకు బ్రిటీష్ కామన్వెల్త్ గేమ్స్
- 1978 నుంచి కామన్వెల్త్ గేమ్స్‌గా కొనసాగుతున్నాయి.
ఇంకొన్ని విషయాలు..
- ఈ ప్రతిష్టాత్మక క్రీడలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా మిస్ కాకుండా ఆరు దేశాలు మాత్రమే ఆడుతున్నాయి. వాటిలో ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, వేల్స్. వీటిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా, న్యూజిలాండ్.. ప్రతిసారి కనీసం ఓ గోల్డ్‌మెడల్‌ను అయినా దక్కించుకున్నాయి.
- ఈ కామన్వెల్త్ క్రీడల్లో ఆస్ట్రేలియా అత్యధిక పతకాలు గెలుచుకుంది. 2416 మెడల్స్‌ను దక్కించుకుంది. ఇందులో 932 స్వర్ణాలు, 775 రజతాలు, 709 కాంస్య పతకాలున్నాయి. ఆ తర్వాత ఇంగ్లాండ్(2144), కెనడా(1555), భారత్(503) రెండు, ముడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.
- 1930 నుంచి ఇప్పటివరకు ఈ కామన్వెల్త్‌తో పలు క్రీడాంశాలను చేర్చారు. కొన్నింటిన తీశారు. కానీ ప్రారంభం నుంచి ఇప్పటివరకు అథ్లెటిక్స్, డైవింగ్, స్విమ్మింగ్, రెజ్లింగ్ మాత్రమే ఉన్నాయి.
ఇదీ చూడండి: ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా దాదా ఎంపిక ఖరారైనట్లేనా?