Wrestlers Protest: భారత రెజ్లింగ్ సమాఖ్యకు అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్.. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ప్రముఖ రెజ్లర్లు బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ సహా పలువురు క్రీడాకారులు చేపట్టిన ఆందోళన తీవ్ర దుమారం రేపాయి. రెజ్లర్ల నిరసన తీవ్రం కావడంతో రంగంలోకి దిగిన క్రీడల శాఖ.. డబ్ల్యూఎఫ్‌ఐను వివరణ కోరింది. ఈ నేపథ్యంలోనే రెజ్లింగ్ సమాఖ్య శనివారం తమ స్పందన తెలియజేసింది. మహిళా క్రీడాకారులు చేస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలను సమాఖ్య ఖండించింది. వ్యక్తిగత అజెండాతోనే ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టింది.
"భారత రెజ్లింగ్ సమాఖ్యను తన విధివిధానాల ప్రకారం ఎన్నికైన పాలకవర్గం నిర్వహిస్తుంది. ఇందులో అధ్యక్షుడితో సహా ఏ ఒక్కరూ ఏకపక్షంగా వ్యవహరించేందుకు లేదా అధికార దుర్వినియోగానికి పాల్పడేందుకు అవకాశమే లేదు. ప్రస్తుత అధ్యక్షుడి నాయకత్వంలో డబ్ల్యూఎఫ్‌ఐ రెజ్లర్ల ఉతమ ప్రయోజనాల కోసమే పనిచేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో కుస్తీ క్రీడకు సమాఖ్య ఎంతో గుర్తింపు తీసుకొచ్చింది. పారదర్శకమైన, కఠినమైన మేనేజ్‌మెంట్ వల్లే ఇది సాధ్యమైంది. రెజ్లర్లు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు. వారంతా వ్యక్తిగత అజెండా లేదా ఓ రహస్య అజెండాతోనే ఈ ఆందోళనకు దిగారు. ప్రస్తుత మేనేజ్‌మెంట్ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు ఎవరైనా రెజ్లర్లపై ఒత్తిడి తీసుకొచ్చి ఉండొచ్చు" అని డబ్ల్యూఎఫ్‌ఐ క్రీడల శాఖకు వివరణ ఇచ్చింది.
అయితే రెజ్లర్ల ఆందోళనలో శుక్రవారం కీలక పరిణామం జరిగింది. బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ).. స్టార్ బాక్సర్ మేరీకోమ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దీనిపై విచారణ జరిపి 10 రోజుల్లోగా నివేదిక ఇవ్వనుంది. అటు క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా.. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు కొత్త కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కమిటీ విచారణ పూర్తయ్యేవరకు బ్రిజ్‌భూషణ్ అధ్యక్ష బాధ్యతలకు దూరంగా ఉంటాడని పేర్కొన్నారు. దీంతో రెజ్లర్లు తమ ఆందోళన విరమించారు.