ప్రతిష్ఠాత్మక కామన్‌వెల్త్ క్రీడల్లో రెండుసార్లు పతకాలు సాధించిన భారత వెయిట్ లిఫ్టర్ సంజిత చానుకు యాంటీ డోపింగ్ ఏజన్సీ పెద్ద షాకే ఇచ్చింది. డోప్ పరీక్షలో విఫలమైన కారణంగా నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఆమెపై నాలుగేళ్ల నిషేధాన్ని విధించింది. దీంతో ఆమె సెప్టెంబరులో జరగనున్న ఆసియా క్రీడలు, వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు అవకాశం అసాధ్యమే. ఈ విషయాన్ని ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు సహదేవ్ యాదవ్ వెల్లడించారు. జాతీయ క్రీడల్లో గెలిచిన ఆమె వద్ద నుంచి ఆ వెండి పతకాన్ని వెనక్కి తీసుకోనున్నారు.
అయితే డోప్ పరీక్షలో విఫలమవడం సంజితకు ఇదేం మొదటిసారి కాదు. 2017 నేషనల్ గేమ్స్ సందర్భంగా ఈ టెస్టు నిర్వహించగా.. ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్‌లో నిషేధిత అనబాలిక్ స్టెరాయిడ్ డ్రొస్టానొలోన్ మెటాబొలైట్ ఆనవాలు లభించింది. ఆ ఘటనతో ఆమెను అంతర్జాతీయ వెయిట్‌లిఫింట్ సమాఖ్య 2018లోనే నిషేధించింది. కానీ ఆ నిషేధాన్ని 2020లో ఎత్తివేసింది. మణిపుర్‌కు చెందిన సంజితచాను 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో 48 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించింది. 2018 ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో 53 కేజీల విభాగంలో ఛాంపియన్‌గా నిలిచింది.