సంకల్పం గట్టిదైతే వైకల్యం అడ్డు రాదని, ఏదైనా సాధించొచ్చని పాకిస్థాన్‌కు చెందిన దివ్యాంగుడు మహ్మద్ ఇక్రామ్ నిరూపిస్తున్నాడు. పుట్టుకతోనే రెండు చేతులు లేకపోయినా.. స్నూకర్‌ను గడ్డం(దవడ ముందు భాగం)తో ఆడి ఔరా అనిపిస్తున్నాడు.
పాకిస్థాన్ పంజాబ్‌కు చెందిన ఇక్రమ్‌కు పుట్టుకతోనే రెండు చేతులు లేవు. చిన్నప్పటి నుంచి స్నూకర్ అంటే అమితమైన ఇష్టం. తోటి వయసు పిల్లలంతా ఇండోర్ గేమ్స్ ఆడుతుంటే తనకు ఆడాలనిపించేది. దీంతో అందరిలా తనకిష్టమైన స్నూకర్‌ను ఆడాలని ధృడంగా నిశ్చయించుకున్నాడు. ఇంటికి దగ్గరలో ఉన్న స్నూకర్ క్లబ్‌కు రోజూ వెళ్లి గడ్డంతో శిక్షణ చేస్తుండేవాడు. చుట్టుపక్కన్న వారు హేళన చేస్తున్నా సరే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అలానే శిక్షణ కొనసాగించాడు. క్రమ క్రమంగా స్థానికంగా జరిగే పోటీల్లో పాల్గొని.. ఇప్పటి వరకు మూడు టోర్నీల్లో విజేతగా నిలిచాడు. ప్రస్తుతం అతడి ఆట పాక్ ప్రజలందరి దృష్టినీ ఆకర్షించింది. హేళన చేసిన వారే ఇప్పుడు తనను పొగుడ్తున్నారు.
విదేశాల్లోనూ ఆడి గొప్ప ఆటగాడిగా ఎదగడమే తన లక్ష్యమని ఇక్రామ్ చెప్పాడు. ప్రభుత్వం తనకు అండగా నిలవాలని ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు విజ్ఞప్తి చేశాడు.