ఇటీవలే అంతర్జాతీయ రెజ్లింగ్ పోటీల్లో వరుసగా రెండు స్వర్ణాలతో భారత దేశ గౌరవాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్. ఇలాంటి ఎందరో ప్రముఖ క్రీడాకారులు శిక్షణ తీసుకుంటున్న లఖ్‌నవూలోని జాతీయ స్థాయి శిక్షణా శిబిరంలో... 24 గంటల పాటు కరెంటు సరఫరా నిలిచిపోయింది. శుక్రవారం జరగిన ఈ అసౌకర్యాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది వినేశ్.
" దాదాపు 24 గంటల పాటు జాతీయ రెజ్లింగ్ క్యాంప్‌లో కరెంట్ లేదు. రాత్రంతా నిద్ర లేకుండా ఎలా శిక్షణలో పాల్గొనాలి. ఒక్క ఫ్యాన్ పనిచేయలేదు. లఖ్‌నవూలో 36 డిగ్రీల వేడిలో చెమటలు కక్కుతూ ఉండాల్సి వచ్చింది".
-- వినేశ్ ఫొగట్, భారత రెజ్లర్
వినేశ్ ఫొగట్ ట్విట్టర్లో ఈ విషయాన్ని పంచుకోగానే 40 నిముషాల తర్వాత కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజు స్పందించారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై అధికారులు సమాధానమిచ్చారని, ఓ ట్రాన్స్ఫార్మర్ దెబ్బతినడమే కరెంట్ కోతకు కారణమని కిరణ్ రిజుజు వెల్లడించారు.
" టాన్స్‌ఫార్మర్ కాలిపోవడం వల్ల దానిని బాగు చేసేందుకు సమయం పట్టింది. ఉదయం వరకు జనరేటర్లతోనే విద్యుత్ సరఫరా చేశాం. అప్పుడు ఫ్యాన్లు పనిచేశాయి. కాసేపటికే పూర్తిగా సరఫ దెబ్బతింది ".
-- అధికారులు
ఇటీవలే యాసర్ డోగు అంతర్జాతీయ రెజ్లింగ్ మీట్లో పసిడి సొంతం చేసుకుంది వినేశ్. 53 కిలోల విభాగంలో పాల్గొని వరుసగా రెండు బంగారు పతకాలు సాధించింది.