ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అజేయంగా దూసుకెళ్తోన్న భారత అగ్రశ్రేణి బాక్సర్ విజేందర్ సింగ్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమయ్యాడు. ఇప్పటివరకూ తన కెరీర్లో ఓటమన్నదే ఎరుగని అతను.. శుక్రవారం రష్యా పొడగరి బాక్సర్ ఆర్టిష్ లాప్పన్తో తలపడబోతున్నాడు. ఈ బౌట్ ఓడ మీద జరగబోతుండటం విశేషం. అరేబియా సముద్ర జలాల మీద మెజెస్టిక్ ప్రైడ్ క్యాసినో నౌకపై భాగంలో జరిగే ఈ పోరులో బాక్సర్లు విజయం కోసం పోరాడనున్నారు.
ప్రొఫెషనల్ కెరీర్ బౌట్ల రికార్డు 12-0గా (అందులో 8 నాకౌట్లు) ఉన్న 35 ఏళ్ల విజేందర్ 2019 నవంబర్ తర్వాత తొలిసారి రింగ్‌లో అడుగుపెట్టబోతున్నాడు. 26 ఏళ్ల ప్రత్యర్థి నుంచి అతనికి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. 6.4 అడుగుల పొడవున్న లాప్సన్ ఇప్పటివరకు ఆరు బౌట్లలో నాలుగింట్లో (రెండు నాకౌట్లు) గెలిచి, ఒక దాంట్లో ఓడిపోయాడు. మరోదాన్ని డ్రా చేసుకున్నాడు.
"లాప్సన్ పొడుగ్గా ఉంటాడు. అతనితో బౌట్‌ను నెమ్మదిగా ఆరంభిస్తా. ఏదేమైనా అతణ్ని ఓడిస్తాననే నమ్మకంతో ఉన్నా, బాక్సింగ్‌లో ఎత్తుగా ఉంటే సరిపోదు. బలం, వ్యూహం కావాలి. నా అనుభవంతో పోలిస్తే అతనో పిల్లాడు. ఈ బౌట్ తర్వాత కూడా నా అజేయ రికార్డు కొనసాగుతుంది. ప్రత్యర్థి ఎంత కఠినంగా ఉంటే పోరు అంత సరదాగా ఉంటుంది" అని విజేందర్ పేర్కొన్నాడు.