Ukraine Russia war Fifa worldcup: ఉక్రెయిన్‌పై సైనిక చర్య నేపథ్యంలో అంతర్జాతీయంగా రష్యాను ఏకాకిని చేసేందుకు ఇప్పటికే అమెరికాతో సహా పశ్చిమ దేశాలు అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా రష్యా ఫుట్‌బాల్ జట్లను ఈ ఏడాది జరగనున్న ప్రపంచకప్‌తో పాటు అన్ని అంతర్జాతీయ పోటీలు, లీగ్‌ల నుంచి బహిష్కరిస్తున్నట్లు ఫిఫా, యూఈఎఫ్‌ఏ సంయుక్త సమావేశంలో వెల్లడించాయి. తదుపరి నోటీసు ఇచ్చేవరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని తెలిపాయి.
ఈ ఏడాది చివరలో జరగనున్న ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు రష్యా పురుషుల జట్టు క్వాలిఫైయింగ్ ప్లే ఆఫ్ సెమీఫైనల్‌లో పోలాండ్‌తో మార్చి 24న తలపడనుంది. ఆ తర్వాత స్వీడన్ లేదా చెక్‌రిపబ్లిక్‌తో తలపడే అవకాశం ఉంది. అయితే ఈ మూడు జట్లు రష్యాతో ఆడడానికి నిరాకరించాయి. రష్యాను బహిష్కరించాలని పట్టుబట్టాయి. ఉక్రెయిన్ ప్రజల కోసం సంఘీభావంగా ఫుట్‌బాల్ ప్రపంచం ఐక్యంగా ఉందని ఫిఫా, యూఈఎఫ్‌ఏ తెలిపాయి. ఉక్రెయిన్‌లో పరిస్థితులు వేగంగా మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని, ఫుట్‌బాల్ క్రీడ ప్రజల మధ్య శాంతి, ఐక్యత నెలకొలుపుతుందని ఆశిస్తున్నట్లు ఫిఫా, యూఈఎఫ్‌ఏ అధ్యక్షులు జియాని ఇన్‌ఫాంటినో, అలెగ్జాండర్ సెఫెరిన్ తెలిపారు.
మరో ఎదురుదెబ్బ
రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఏడాది అంతర్జాతీయ ఐస్ హాకీ ఫెడరేషన్ (ఐఐహెచ్ఎఫ్) ఆధ్వర్యంలో జరగాల్సిన ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌పై రష్యాకు ఉన్న ఆతిథ్య హక్కులను రద్దు చేసింది. త్వరలో చర్చల ద్వారా మరో వేదికను నిర్ణయించనున్నట్లు ఐఐహెచ్ఎఫ్ స్పష్టం చేసింది.
అంతేకాదు.. ఐఐహెచ్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగే పోటీల్లో రష్యా, బెలారస్ దేశాలకు చెందిన జట్లు, క్లబ్‌లు పాల్గొనడంపై నిషేధం విధించింది. తదుపరి ఆదేశాల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొంది.
ఇదీ చూడండి: టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్లో కొత్త శకం