ప్రపంచంలోనే అత్యున్నత క్రీడా సంగ్రామమైన ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని అథ్లెట్లు కలలు కంటారు. విజేతగా నిలిస్తే తమ కెరీర్‌కు సార్థకత వచ్చిందని సంబరపడిపోతారు. మరి అలాంటి ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో విజేతలకు ఇచ్చే పతకాలకు ఎంతో ప్రత్యేకత ఉండాలి? ఈ సారి టోక్యో ఒలింపిక్స్‌లో పోడియంపై నిలబడే అథ్లెట్లకు ఇచ్చే పతకాల విషయంలో ఓ విశేషం ఉంది. వాడిపాడేసిన సెల్‌ఫోన్లు, ఇతర చిన్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల నుంచి తీసిన బంగారం, వెండి, కంచుతో ఈ పతకాలకు రూపమిచ్చారు. దాదాపు 79 వేల టన్నులకు పైగా పునర్వినియోగ ఎలక్ట్రానిక్ చెత్తను జపాన్ ప్రజల నుంచి సేకరించిన టోక్యో నిర్వాహకులు పతకాలను తయారు చేశారు. 8.5 సెంటీమీటర్ల వ్యాసంతో ఉండే ఈ పతకాలపై గ్రీకు విజయ దేవత నైక్ ఎగురుతున్న బొమ్మ ఉంటుంది.
ఆలివ్ దండతో మొదలై..:
పురాతన ఒలింపిక్ క్రీడల్లో విజేతగా నిలిచిన అథ్లెట్లకు బహుమతిగా ఆలివ్ ఆకులతో చేసిన దండను తలపై పెట్టేవాళ్లు. 1896 ఏథెన్స్ ఒలింపిక్స్ నుంచే విజేతలకు పతకాలు అందించడం మొదలైంది. విజేతలకు రజతం, రన్నరప్‌గా నిలిచిన వాళ్లకు రాగి లేదా కాంస్య పతకం ఇచ్చేవాళ్లు. గ్రీకు పురాణాల ప్రకారం దేవతలకు తండ్రి అయిన జ్యూస్ గౌరవార్థం ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు. అందుకే పతకానికి ముందు భాగంలో నైక్‌ను పట్టుకుని ఉన్న జ్యూస్ బొమ్మ ఉండేది. వెనక వైపు వివిధ భవనాలతో కూడిన ఆక్రోపోలిస్ చిత్రం ఉండేది. ఎనిమిదేళ్ల వరకూ అవే పతకాలు కొనసాగాయి. 1904లో తొలిసారిగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను ఉపయోగించారు. గ్రీకు పురాణాల ప్రకారం ఈ మూడు పతకాలు మూడు తరాలకు ప్రతీకలుగా భావిస్తారు.
ఆ తర్వాతి శతాబ్దంలో పతకాల ఆకారం, పరిమాణం, బరువు, కూర్పు, వాటిపై వాడే చిత్రాల్లో మార్పులు వచ్చాయి. 1923లో పతకాల ఆకృతి కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) పోటీలు పెట్టడం మొదలెట్టింది. 1928లో ఇటలీ కళాకారుడు కాసియోలి రూపొందించిన పతకం చాలా ఏళ్ల పాటు కొనసాగింది. నైక్ ఓ చేతిలో పొడవైన ఆకుల గుత్తి, మరో చేతిలో కిరీటం పట్టుకున్నట్లు పతకాన్ని తీర్చిదిద్దారు. 2004లో మళ్లీ మార్పులు చేశారు. పానథెనాయిక్ స్టేడియంలోకి ఎగురుతూ వెళ్తున్నట్లు ఉన్న నైక్ బొమ్మతో పతకాలు తయారుచేశారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ కోసం చైనా లోహంతో కాకుండా జేడ్ అనే పదార్థంతో తయారు చేశారు. 2016 రియో క్రీడల్లో తొలిసారి ఎక్కువ మొత్తంలో పునర్వినియోగానికి అనువైన పదార్థాలతో పతకాలు రూపొందించారు. ఇప్పుడు టోక్యో కూడా అదే బాటలో సాగింది. 1960 వరకూ అథ్లెట్ల బ్రేజర్లకు పతకాలు తగిలించేవాళ్లు. ఆ ఏడాది రోమ్ ఒలింపిక్స్‌లో మెడలో వేయడం మొదలెట్టారు.
ఇదీ చదవండి:Olympics: త్వరలో ఒలింపిక్స్.. మరోవైపు భారీగా కేసులు