Wimbledon ban on Russia: దురాక్రమణకు కాలుదువ్విన రష్యాపై ఆంక్షల్లో భాగంగా వింబుల్డన్‌లో పాల్గొనకుండా ఆ దేశ ఆటగాళ్లపై నిషేధం విధించడాన్ని టెన్నిస్ దిగ్గజ ప్లేయర్లు రఫేల్ నాదల్, నొవాక్ జకోవిచ్ తప్పుబట్టారు. ఈ విషయంలో వింబుల్డన్ అన్యాయంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. 'మా సహోదరులైన రష్యా టెన్నిస్ ఆటగాళ్లను వింబుల్డన్‌లో పాల్గొనకుండా చేయడం అన్యాయం. యుద్ధం విషయంలో ఏదైతే జరుగుతుందో.. అది వారి తప్పు కాదు. వారి పట్ల క్షమాపణతో ఉన్నా' అని నాదల్ చెప్పుకొచ్చాడు. 'ప్రభుత్వమేమీ ఒత్తిడి చేయలేదు. అయినప్పటికీ.. వింబుల్డన్ తనంతట తానుగా ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే కొద్ది వారాల్లో ఏం జరుగుతుందో చూడాలి. ఆటగాళ్లు దీనిపై ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది' అని నాదల్ అన్నాడు.
Djokovic on Russia ban: కాగా, వింబుల్డన్ నిర్ణయాన్ని ఇదివరకే వ్యతిరేకించాడు జకోవిచ్. తాజాగా.. మరోసారి ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుత పరిస్థితులను ఆస్ట్రేలియా ఓపెన్ సమయంలో జరిగిన పరిణామాలతో పోల్చాడు. కరోనా టీకా వేసుకోనందున అతడిని ఆస్ట్రేలియా.. తమ దేశం నుంచి బహిష్కరించింది. దీంతో ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీలో జకోవిచ్ పాల్గొనలేకపోయాడు. 'ఈ రెండు సంఘటనలు ఒకటి కాకపోవచ్చు. కానీ, ఇతర కారణాల వల్ల గేమ్ ఆడలేకపోతే చికాకు కలుగుతుంది. వింబుల్డన్ నిర్ణయానికి నేను మద్దతు ఇవ్వడం లేదు. ఇప్పటికీ నా వైఖరిలో మార్పులేదు. వింబుల్డన్ నిర్ణయం సరికాదు. అది అన్యాయం' అని జకోవిచ్ స్పష్టం చేశాడు.
జూన్ 27 నుంచి వింబుల్డన్ టోర్నీ ప్రారంభం కానుంది. రష్యాతో పాటు యుద్ధంలో ఆ దేశానికి సహకరిస్తున్న బెలారస్‌పైనా వింబుల్డన్ ఆడకుండా నిషేధం విధించింది ఆల్ ఇంగ్లండ్ క్లబ్. ఈ బ్యాన్ ఫలితంగా.. ప్రస్తుతం ర్యాంకింగ్‌లో రెండో స్థానంలో ఉన్న మెద్వెదెవ్కు టోర్నీలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. అతడితో పాటు 2021 వింబుల్డన్ సీజన్ సెమీఫైనలిస్ట్ ఆర్యానా సబలెంక(నాలుగో ర్యాంకు), ర్యాంకింగ్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న ఆండ్రే రూబ్లెవ్కు సైతం టోర్నీకి దారులు మూసుకుపోయాయి. మహిళల విభాగంలో మాజీ నెం.1 విక్టోరియా అజరెంక, 2021 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ అనస్తేషియా పవ్లియుచెంకోవా సైతం వింబుల్డన్‌కు దూరం కానున్నారు. ఆల్ఇంగ్లాండ్ క్లబ్ తీసుకున్న నిర్ణయాన్ని అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ఫెడరేషన్(ఏటీపీ), ది విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్(డబ్ల్యూటీఏ) సంస్థలు బహిరంగంగానే వ్యతిరేకించాయి.
ఇదీ చదవండి: ధోనీ చుట్టూ చేరిన సన్‌రైజర్స్ ఆటగాళ్లు.. అంతలోనే స్టెయిన్ వచ్చి...