క్రికెట్, కబడ్డీ, హాకీ తదితర క్రీడల్లో ఇప్పటికే దేశంలో, ప్రపంచంలో ఎన్నో లీగ్‌లు జరుగుతున్నాయి. ఇప్పుడిక చదరంగాన్ని అత్యున్నత స్థాయికి చేర్చేందుకు గ్లోబల్ చెస్ లీగ్ వచ్చేస్తోంది. ఈ ఫిజిటల్ (ఫిజికల్, డిజిటల్) గ్లోబల్ చెస్ లీగ్‌కు శ్రీకారం చుడుతున్నట్లు ప్రముఖ ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా సోమవారం ప్రకటించింది.
అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఈ లీగ్‌కు మార్గనిర్దేశకుడిగా, భాగస్వామిగా, సలహాదారుడిగా.. ఇలా అన్ని రకాలుగా లీగ్‌ను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది ఫ్రాంఛైజీలు ఈ లీగ్‌లో పాల్గొననున్నాయి. అగ్రశ్రేణి మహిళలు, పురుషులతో పాటు జూనియర్, వైల్డ్‌కార్డు ప్రవేశం పొందే ప్లేయర్లు ఒక్కో జట్టులో ఉంటారు. రౌండ్ రాబిన్ విధానంలో ఒకరికొకరు పోటీపడతారు.
లీగ్ విధివిధానాలు, ఫ్రాంఛైజీల పేర్లు, టోర్నీ తేదీల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. 5జీ, కృత్రిమ మేధ, వర్చువల్ సాంకేతిక సాయంతో ఈ లీగ్ ద్వారా చెస్‌ను మరింత ఆకర్షణగా, ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ఆదరణ పొందేలా తీర్చిదిద్దుతామని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.
ఇదీ చూడండి: ఫిట్నెస్ టెస్ట్ పాస్.. పింక్-టెస్టుకు ఉమేశ్!