టోక్యో ఒలింపిక్స్‌కు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. శుక్రవారం విశ్వక్రీడలకు సంబంధించి ప్రారంభ వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో 1964, 1968, 1972 ఒలింపిక్స్ సందర్భంగా జరిగిన పలు వింతలు, విశేషాలు మీకోసం..
టోక్యో ఒలింపిక్స్-1964
- ఆసియాలో జరిగిన మొదటి సమ్మర్ ఒలింపిక్స్ ఇవి.
- ఒలింపిక్ టార్చ్ రిలేగా యోషినోరి సకాయ్ను ఎంపిక చేశారు. హిరోషిమాపై అణుబాంబు దాడి జరిగిన 1945 ఆగస్టు 6న యోషినోరి పుట్టడమే ఇందుకు కారణం. ప్రపంచ శాంతిని కోరుతూ ఈ వ్యక్తిని టార్చ్ బేరర్‌గా నియమించారు.
- ఇథియోపియాకు చెందిన అబేబే బికిలా.. మారథాన్‌ను రెండు సార్లు గెలిచిన తొలి అథ్లెట్‌గా నిలిచింది.
- స్టాప్ వాచ్‌ను క్రీడల్లో ఉపయోగించడం ఈ ఒలింపిక్స్‌లోనే చివరిసారి.
- తూర్పు, పశ్చిమ జర్మనీ జట్లు ఒకే టీమ్‌గా ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇదే చివరిసారి.
- వాలీబాల్, జూడో ఆటలు మొట్టమొదటి సారిగా విశ్వక్రీడల్లో భాగమయ్యాయి.
- ట్రాక్ అండ్ ఫీల్డ్‌లోని 36 ఈవెంట్లలో 27 వాటిల్లో కొత్త రికార్డులు నమోదయ్యాయి.
- 1964 క్రీడల్లో అమెరికా స్విమ్మర్ షారోన్ స్టౌడర్ మూడు స్వర్ణాలతో పాటు ఒక రజత పతకం గెలుచుకుంది. అప్పటికి ఆమె వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే.
- ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో సిండర్ ట్రాక్‌లను ఉపయోగించడం ఇదే ఆఖరి సారి.
ఇదీ చదవండి: ఒలింపిక్స్: ఈసారి వాటికి దూరం- అతిథులూ తక్కువే!
మెక్సికో సిటీ ఒలింపిక్స్-1968
- లాటిన్ అమెరికా దేశమైన మెక్సికోలో ఒలింపిక్స్ జరగడం ఇదే మొదటిసారి. దీంతో పాటు స్పానిష్ భాష మాట్లాడే దేశంలో విశ్వక్రీడల నిర్వహణ ఇదే తొలిసారి.
- ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో నున్నటి ట్రాక్‌ను ఈ క్రీడల్లోనే తొలిసారి ఉపయోగించారు. అంతకుముందు సిండర్ ట్రాక్‌లను వాడేవారు.
- 400 మీ, 800మీ పరుగుతో పాటు జంపింగ్, త్రోయింగ్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో మెక్సికో ఆటగాళ్లు అంచనాలకు మించి రాణించారు.
- ఈ క్రీడా ప్రారంభోత్సవ వేడుకల్లో క్రీడా జ్యోతి వెలిగించిన మొదటి మహిళగా మెక్సికో హర్డ్లర్ ఎన్రిక్వెటా బసిలియో నిలిచింది.
- నిషేధిత ఉత్ప్రేరకాలు వాడిన మొదటి అథ్లెట్‌గా స్వీడన్ పెంటాథ్లెట్ హన్స్-గున్నర్ లిల్జెన్‌వాల్ నిలిచింది. దీంతో తాను గెలుపొందిన కాంస్య పతకాన్ని వెనక్కి తీసుకున్నారు నిర్వాహకులు.
- తొలిసారిగా తూర్పు, పశ్చిమ జర్మనీ దేశాలు విడివిడిగా పాల్గొన్నాయి.
- 200మీ విజేత కార్యక్రమంలో ఆఫ్రికన్-అమెరికన్లు టోమ్మీ స్మిత్(స్వర్ణం), జాన్ కార్లోస్(కాంస్యం).. చెప్పుల్లేకుండా నిలబడ్డారు. అమెరికాలోని నల్లజాతి వారి జీవన పరిస్థితులకు ఇలా నిరసన తెలిపారు. వీరిపై నిషేధం విధించి ఒలింపిక్ గ్రామం నుంచి ఇంటికి పంపించారు.
మ్యూనిచ్ ఒలింపిక్స్-1972
- 1972 ఒలింపిక్స్ ప్రారంభమైన వారం తర్వాత మ్యూనిచ్‌లో ఉగ్రదాడులు జరిగాయి. ఇందులో ఇజ్రాయెల్ అథ్లెట్లు, కోచ్‌లు, పశ్చిమ జర్మనీ పోలీసు సహా మొత్తం 11 మంది చనిపోయారు.
- ఈ దాడుల్లో చనిపోయిన మృతులకు సంతాపం ప్రకటించడానికి 34 గంటల పాటు ఆటలను నిలిపివేశారు. ప్రధాన స్టేడియంలో వారికి నివాళులు అర్పించారు.
- ఈ ఒక్క ఒలింపిక్స్‌లోనే అమెరికా స్విమ్మర్ మార్క్ స్పిట్జ్ 7 బంగారు పతకాలు గెలుచుకుని ఔరా అనిపించాడు. అతని కెరీర్ మొత్తంలో 9 గోల్డ్ మెడల్స్ సాధించాడు మార్క్.
- ఒలింపిక్స్‌లో ఉగ్రదాడుల నేపథ్యంలో మార్క్ ముందుగానే విశ్వక్రీడలను వీడాడు. అతడు యూదుడు కావడమే ఇందుకు కారణం.
- తొలిసారిగా ఒలింపిక్స్‌లో అధికారిక చిహ్నాన్ని సృష్టించారు. వాల్ది డచ్షండ్ జర్మనీ జాతి శునకాన్ని మస్కట్‌గా వాడారు.
- 52 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్చరీ.. తిరిగి ఒలింపిక్స్‌లో చోటు సంపాదించింది.
ఇదీ చదవండి: బ్రిస్బేన్ వేదికగా 2032 ఒలింపిక్స్