Southafrica Boxer Dead: దక్షిణాఫ్రికా బాక్సింగ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఆ దేశ బాక్సర్ సిమిసో బుతలెజి అనూహ్య పరిణామాల మధ్య ప్రాణాలు విడిచాడు. ఓ ఔట్‌లో భాగంగా మతి భ్రమించి ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితిలో అతడు కుప్పకూలాడు. వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు. కానీ కోమాలోకి వెళ్లిన అతను చివరకు మెదడులో అంతర్గత రక్తస్రావం కారణంగా మరణించాడు.
ఆదివారం సిఫెసిలె మంతుగ్వాతో సిమిసో తలపడ్డాడు. పంచ్‌లతో చెలరేగిన సిమిసో ప్రత్యర్థిపైకి దూసుకెళ్లాడు. ఆ దశలో పోరు ఆపిన రిఫరీ బాక్సర్లిద్దరినీ వేరు చేసి మళ్లీ బౌట్ మొదలెట్టాడు. అయితే తిరిగి బౌట్ ఆరంభమైన తర్వాత ప్రత్యర్థి వైపు కాకుండా.. తన కుడి వైపు గాల్లో పంచ్‌లు విసురుతూ సిమిసో ఓ మూలకు వెళ్లిపోయాడు. అక్కడ ఉన్న తాళ్లకు తగిలి పడిపోయాడు. అసలు ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో తెలీని స్థితిలోకి అతను చేరుకున్నాడు. దీంతో వెంటనే బౌట్ ఆపేసి అతణ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ మెదడు గాయంతో అతను చనిపోయినట్లు దక్షిణాఫ్రికా బాక్సింగ్ సమాఖ్య బుధవారం ప్రకటించింది. ఈ ఘటనపై స్వతంత్ర వైద్య సమీక్ష నిర్వహిస్తామని తెలిపింది.
ఇదీ చదవండి: ఇండోనేసియా మాస్టర్స్ క్వార్టర్స్‌లో సింధు, లక్ష్యసేన్