Telangana shooter Dhanush Gold medal: డెఫ్‌లింపిక్స్‌లో (బధిరుల ఒలింపిక్స్) తెలంగాణ బధిర షూటర్ ధనుష్ శ్రీకాంత్ జోరు కొనసాగుతోంది. అతను రెండో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే పురుషుల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో పసిడి గెలిచిన అతను.. తాజాగా మిక్స్‌డ్ టీమ్‌లో ప్రియేషతో కలిసి బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఫైనల్లో ధనుష్- ప్రియేష ద్వయం 16-10 తేడాతో సెబాస్టియన్- సబ్రీనా (జర్మనీ)పై విజయం సాధించారు.
అర్హత రౌండ్లో 414 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచిన భారత ద్వయం.. పసిడి పోరులోనూ అత్యుత్తమ ప్రదర్శన కొనసాగించింది. ముఖ్యంగా ధనుష్ మరోసారి సత్తాచాటాడు. పూర్తి ఏకాగ్రతతో లక్ష్యంపై గురిపెట్టాడు. మరోవైపు ఇదే విభాగంలో మరో భారత జోడీ శౌర్య- నటాషా.. కాంస్య పతక పోరులో 8-16తో ఒలెక్సాండర్- లికోవా (ఉక్రెయిన్) చేతిలో ఓడారు. పుట్టుకతోనే చెవులు వినపడని, మాటలు రాని 19 ఏళ్ల ధనుష్.. హైదరాబాద్‌లోని గగన్ నారంగ్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే. డెఫ్‌లింపిక్స్‌లో షూటింగ్‌లో భారత్‌కిది మూడో స్వర్ణం. ఇప్పటికే పురుషుల వ్యక్తిగత 10మీ. ఎయిర్ పిస్టల్‌లో అభినవ్ పసిడి నెగ్గాడు. షూటింగ్‌లోనే మరో రెండు కాంస్యాలు కూడా భారత్ ఖాతాలో చేరిన విషయం విదితమే.
ఇదీ చూడండి: ఆ ఒలింపిక్స్‌లో తెలుగోడి సత్తా... స్వర్ణం గెలిచిన షూటర్