యువరెజ్లర్ సాగర్ రాణా హత్యకేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అరెస్టయిన సుశీల్ కుమార్(Wrestler Sushil) ప్రాణమిత్రుడు ప్రిన్స్ అప్రూవర్‌గా మారేందుకు అంగీకరించాడని తెలిసింది. ఛత్రసాల్ స్టేడియంలో దాడి జరిగినప్పుడు అతడే ఘటనను వీడియో తీశాడు.
ఈ హత్య కేసులో తొమ్మిదో అరెస్టు నమోదైంది. బిందర్ (అసలు పేరు విజేందర్)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాగర్‌ను గాయపరచిన వారిలో ఇతడూ ఒకడు. మొత్తంగా ఈ కేసులో 12 మందిపై అభియోగాలు నమోదు కాగా ప్రవీణ్, ప్రదీప్, వినోద్ ప్రధాన్ తప్పించుకొని తిరుగుతున్నారు. వారిని పట్టుకొనేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు.
ఛత్రసాల్ స్టేడియంలో మే 4న సాగర్ రాణాపై సుశీల్ కుమార్ బృందం దాడి చేసింది. తీవ్రంగా గాయపడ్డ సాగర్ రెండు రోజుల తర్వాత మరణించాడు. అప్పటి నుంచి సుశీల్ తప్పించుకొని తిరిగాడు. పోలీసులు ఎనిమిది బృందాలుగా విడిపోయి అతడి ఆచూకీ కనుగొన్నారు. గత ఆదివారం అరెస్టు చేసి కోర్టుకు తరలించగా అతడికి న్యాయస్థానం ఆరు రోజుల రిమాండ్ విధించగా.. తాజాగా మరో నాలుగు రోజుల కస్టడీని పొడిగించింది. విచారణలో భాగంగా సుశీల్ కుమార్‌తోపాటు, అతడి సహచరుడు అజయ్‌కు నాలుగు రోజుల కస్టడీని పొడిగిస్తూ శనివారం దిల్లీ హైకోర్టు తీర్పు వెలువడించింది.
ఇదీ చూడండి: సుశీల్ కస్టడీ మరో 4 రోజులు పొడిగింపు