Russia Sports Ban: ఉక్రెయిన్పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాపై అనేక దేశాలు ఆంక్షల్ని విధిస్తున్నాయి. ఇదే క్రమంలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్, హాకీ క్రీడా సమాఖ్యలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. రష్యా, బెలారస్ దేశాల ఆటగాళ్లు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లు ఆడకుండా బీడబ్ల్యూఎఫ్(బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్) బహిష్కరించింది. ఈ మేరకు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య మంగళవారం ప్రకటించింది. తదుపరి నోటీసులు జారీ చేసేవరకూ ఆయా దేశాలపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది. దీని వల్ల మార్చి 8 నుంచి 13 వరకు జరగనునన్న జర్మన్ ఓపెన్లో రష్యా, ఉక్రెయిన్ దేశాల ఆటగాళ్లు పాల్గొనరని పేర్కొంది.
"ఉక్రెయిన్ ప్రజలకు, బ్యాడ్మింటన్ సమాజానికి మా సమాఖ్య మద్దతు పూర్తిగా ఉంటుంది. మా భాగస్వాములందరితో చర్చించాం. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రజలందరి మధ్య శాంతిని పెంపొందించేందుకు కృషిచేస్తాం."
-అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య
కొంతమంది రష్యన్ ఆటగాళ్లు మాత్రం స్పెయిన్లో జరిగే అంతర్జాతీయ పారాబ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పాల్గొంటారని బీడబ్ల్యూఎఫ్ వెల్లడించింది. ఇప్పటికే స్పెయిన్కు చేరుకున్న ఆటగాళ్లు టోర్నీలో పాల్గొనేందుకు అనుమతి ఇస్తామని తెలిపింది. సంస్థాగత నిర్ణయాల వల్ల వీరిని ఆడకుండా ఆపలేమని ఐఓసీ పేర్కొంది. వీరందరూ దేశ పతాకాలు, గీతాలు లేకుండా పాల్గొనాలని చెప్పింది.
బ్యాడ్మింటన్ సమాఖ్య బాటలోనే హాకీ...
దక్షిణాఫ్రికాలో ఏప్రిల్ 1 నుంచి 12 వరకు జరగబోయే హాకీ మహిళల జూనియర్ ప్రపంచకప్ నుంచి రష్యాను బహిష్కరించింది అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్(ఎఫ్ఐహెచ్). ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది.
"ఉక్రెయిన్ హాకీ సంఘంతో మా సమాఖ్య సంప్రదింపులు జరుపుతోంది. ఆ దేశానికి అవసరమైన సహయాన్ని అందిస్తాం. ఆ దేశ జట్టు.. వచ్చే హాకీ మహిళల జూనియర్ టోర్నమెంట్లో పాల్గొనాలని ఆశిస్తున్నాం. శాంతియుత పరిష్కారం రావాలని బలంగా కోరుకుంటున్నాం."
-అంతర్జాతీయ హాకీ సమాఖ్య
దేశ సమగ్రత, ఆటగాళ్ల భద్రత విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సోమవారమే కొత్త నిబంధనల్ని తీసుకువచ్చింది. రష్యా, బెలారస్లకు వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాలని తెలిపింది. ఇప్పటికే ఫుట్‌బాల్ సమాఖ్య రష్యాను బహిష్కరించింది.
ఇదీ చదవండి: రష్యాకు భారీ దెబ్బ.. ఫుట్‌బాల్ ప్రపంచకప్ నుంచి బహిష్కరణ