రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు(డబ్ల్యూఎఫ్‌ఐ) బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపిన పర్యవేక్షక కమిటీ నివేదికను బయటపెట్టాలని స్టార్ రెజ్లర్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఆదివారం నుంచి దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బజ్‌రంగ్ పునియా, సాక్షి మలిక్, వినేశ్ ఫొగాట్ సహా అగ్రశ్రేణి రెజ్లర్లంతా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇలా చేయడం పట్ల భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష స్పందించారు. అసహనం వ్యక్తం చేస్తూ.. వారి చర్యలను తప్పుపట్టారు. రెజ్లర్లు రోడ్డెక్కి ధర్నాలు, నిరసనలు చేయడం క్రమశిక్షణారాహిత్యమని అన్నారు. ఈ చర్యలు దేశ ప్రతిష్ఠను దిగజార్చుతాయని పేర్కొన్నారు.
"లైంగిక వేధింపుల కంప్లైంట్ కోసం ఒలింపిక్ అసోసియేషన్‌లో కమిటీతో పాటు క్రీడాకారుల కమిషన్ ఉంది. ఇలా రోడెక్కే బదులు మా దగ్గరకు రావాల్సింది. కానీ రెజర్లు అలా రాలేదు. వారు అలా వీధుల్లో నిరసనలు చేయడం క్రమశిక్షణా రాహిత్యం. ఇది భారతదేశ ప్రతిష్ఠను దిగజార్చుతోంది" అని ఐఓఎస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం తర్వాత ఉష మీడియా విలేకరులతో అన్నారు.
అయితే పీటీ ఉష వ్యాఖ్యలపై బజరంగ్ పునియా స్పందించాడు. "ఐఓఎస్ అధ్యక్షురాలు పీటీ ఉష నుంచి ఇలాంటి కఠినమైన స్పందన మేము ఊహించలేదు. ఆమె మాకు మద్దతు ఇస్తారని భావించాం" అని బజ్‌రంగ్ పునియా అన్నాడు. మరోవైపు ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ కూడా దీనిపై స్పందించారు. తన నిర్దోషినని నిరూపించుకుంటానని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణల గురించి ప్రస్తావించకుండా.. ఓపిక ఉన్నంతవరకు పోరాడుతూనే ఉంటానని ఓ వీడియో విడుదల చేశారు.
ప్యానెల్ ఏర్పాటు.. ఇకపోతే భారత రెజ్లింగ్ సమాఖ్య వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది ఐఓఏ. ఈ ప్యానెల్లో మాజీ షూటర్ సుమ శిరూర్, ఉషూ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ భూపేంద్ర సింగ్, రిటైర్డ్ హై కోర్టు జడ్జి (జడ్జి పేరు వెల్లడించలేదు) సభ్యులుగా ఉన్నారు.
ఇదీ జరిగింది.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. బ్రిజ్ భూషణ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ ఓ మైనర్ సహా ఏడుగురు బాలికలు ఇటీవల పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు, గతంలో రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణలపై దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ నేతృత్వంలో ఏర్పాటైన పర్యవేక్షక కమిటీ.. ఏప్రిల్ తొలి వారంలో దర్యాప్తు నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. కానీ ఆ దర్యాప్తు నివేదికను ప్రభుత్వం ఇప్పటి వరకు బయట పెట్టలేదు. మౌనంగా ఉంది. దీంతో రెజ్లరంతా ఆదివారం నుంచి మళ్లీ నిరసన చేస్తున్నారు. ఈ క్రమంలోనే దీనిపై దిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి: బ్రిజ్ భూషణ్‌పై సుప్రీంకు రెజ్లర్లు.. ఎన్నికలు వాయిదా