టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లను ఉత్సాహ పర్చేందుకు వారితో వర్చువల్‌గా భేటీ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా వారితో ముచ్చటిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారులు అంచనాలకు తలవంచకుండా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని పిలుపునిచ్చారు. వారి వెనక దేశం మొత్తం అండగా ఉందన్నారు. అత్యున్నత క్రీడా వేదికపై అథ్లెట్లు రాణించి భారత పతాకం రెపరెపలాడించాలని మోదీ అభిలాషించారు.
ఈ సందర్భంగా ప్రధాని పలువురు దిగ్గజ క్రీడాకారులు మేరీకోమ్, పీవీ సింధు, సౌరభ్ చౌదరి, శరత్ కమల్ ..తదితరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి మొత్తం 228 మంది బృందం వెళుతుందని, అందులో 119 మంది అథ్లెట్లు ఉన్నారని భారత ఒలింపిక్స్ సంఘం అధ్యక్షుడు నరిందర్ బత్రా పేర్కొన్నారు. వీరిలో 67 మంది పురుషులు, 52 మంది మహిళలు ఉన్నారన్నారు. మొత్తం 85 విభాగాల్లో భారత క్రీడాకారులు పోటీపడుతున్నారని చెప్పారు. ఈనెల 17న.. 90 మంది క్రీడాకారులు, ఆయా విభాగాల అధికారులు ప్రత్యేక విమానంలో టోక్యోకు బయలుదేరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి: Tokyo Olympics: క్రీడా గ్రామం ఆరంభం