మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్-2023లో భారత్‌కు మరో రెండు సిల్వర్ మెడల్స్ ఖాయమయ్యాయి. ఈ మెగాటోర్నీలో డిఫెండింగ్ ఛాంప్‌గా బరిలోకి దిగిన భారత స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ అదరగొడుతోంది. రింగ్‌లో తన పవర్ఫుల్ పంచ్‌లతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతోంది. మహిళల 50 కేజీల విభాగంలో పోటీపడుతున్న నిఖత్.. ఇప్పటికే సెమీ ఫైనల్ చేరుకుని పతకాన్ని ఖాయం చేసుకుంది.
అయితే నేడు(మార్చి 23) సెమీఫైనల్ బౌట్‌లో కూడా తన పవర్ పంచ్‌ను చూపించింది. బలమైన పంచ్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. కొలంబియన్ బాక్సర్ ఇంగ్రిట్ లొరెనా వాలెన్సియా విక్టోరియాపై 5-0 తేడాతో అద్భుత విజయం సాధించింది. తద్వారా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక ఈ ఫైనల్లో విజయం సాధిస్తే స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంటుంది. అలానే 48 కేజీల విభాగంలో కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ బాక్సర్ నీతూ ఘంగాస్ కూడా తుదిపోరుకు అర్హత సాధించింది. సెమీఫైనల్లో కఖికిస్థాన్కు చెందిన అలుయా బాల్కిబెకోవాపై 5-2 తేడాతో గెలుపొందింది.
"ఇది నా ఉత్తమ బౌట్. టెక్నిక్ పరంగా మెరుగ్గా ఉన్న బాక్సర్లను ఎదుర్కొన్నప్పుడు నేను అత్యుత్తమంగా ఆడతాననిపిస్తుంది. వాలెన్సియాతో గతంలోనూ తలపడ్డా. ఆమె అనుభవమున్న బాక్సర్. ఆమెతో పోరు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సాగింది"
-నిఖత్, భారత బాక్సర్
అంతకుముందు బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోటీల్లో టోర్నీ ఫేవరెట్ అయిన నిఖత్ 5-2 తేడాతో థాయ్‌లాండ్‌కు చెందిన రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్‌షిప్స్, కాంస్య పతక విజేత చుతామత్ రక్సాత్‌ను మట్టి కురిపించింది. ఈ పోరులోని తొలి రెండు రౌండ్లలో జాగ్రత్తగా ఎటాకింగ్ చేసి పవర్ఫుల్ పంచ్‌లు విసిరిన నిఖత్.. మూడో రౌండ్‌లో మాత్రం కాస్త జోరు తగ్గించి ఆడింది.
ఈ ముగ్గురూ అదుర్స్
ఈ ఛాంపియన్‌షిప్స్‌లో నీతు గాంగాస్ (48 కేజీ), లవ్లీనా (75 కేజీ), స్వీటీ బూర (81 కేజీ) కూడా ఫైనల్స్‌లో అడుగుపెట్టారు. నిరుడు క్వార్టర్స్‌లో తనను ఓడించిన అలువా బల్కిబెకోవా (కజకిస్థాన్)పై నీతు ప్రతీకారం తీర్చుకుంది. సెమీస్‌లో ఆమె 5-2తో గతేడాది రజత విజేత బల్కిబెకోవాను ఓడించింది. తొలి రౌండ్‌లో 2-3తో వెనకబడ్డప్పటికీ నీతు అద్భుతంగా పుంజుకుంది. తనను ప్రత్యర్థి తరచుగా నెడుతూ, కిందపడేసినా.. తిరిగి లేచిన ఆమె పంచ్‌లతో విరుచుకుపడింది. ఉత్కంఠగా సాగిన చివరి రౌండ్లోనూ నీతు అదే వేగాన్ని ప్రదర్శించింది. పోరు హోరాహోరీగా ముగియడంతో చివరికి సమీక్షలో నీతును విజేతగా ప్రకటించారు. ఇప్పటికే ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో రెండు కాంస్యాలు నెగ్గిన లవ్లీనా.. తొలిసారి ఈ టోర్నీ తుదిపోరు చేరింది. సెమీస్‌లో ఆమె 4-1తో లి కియాన్ (చైనా)ను ఓడించింది. స్వీటీ 4-3తో ఎమ్మా గ్రీన్‌ట్రీ (ఆస్ట్రేలియా)పై పోరాడి గెలిచింది.