Neeraj Chopra Latest Interview : ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని ముద్దాడి.. దేశ అథ్లెటిక్స్ గమనాన్నే మార్చిన యోధుడు జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా. పాతికేళ్లకే స్టార్ అథ్లెట్‌గా రాణిస్తూ.. వెళ్లిన ప్రతి చోటా సత్తా ఏంటో చాటుతున్నాడు. ఇటీవల ఆసియా క్రీడల్లో వరుసగా రెండో సారి పసిడి గెలిచిన నీరజ్.. తాజాగా 'అండర్ ఆర్మర్' క్రీడా దుస్తుల, సామాగ్రి స్టోర్‌ను ప్రారంభించేందుకు సోమవారం హైదరాబాద్ వచ్చాడు. ఈ సందర్భంగా అతడు పలు విషయాలు పంచుకున్నాడు. ఆ విశేషాలు మీ కోసం..
ఆసియా క్రీడల్లో భారత్ ఈసారి అత్యుత్తమంగా 107 పతకాలు సాధించింది. అందులో సింహభాగం అథ్లెటిక్స్ (29) నుంచే వచ్చాయి. ఈ ప్రదర్శన గురించి మీకెలా అనిపిస్తోంది?
ఈ ఘనత పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది. వివిధ క్రీడాంశాల్లోని భారత అథ్లెట్లు మెరుగ్గా రాణించడం వల్ల లక్ష్యాన్ని చేరుకోగలిగాం. అందులోనూ అథ్లెటిక్స్‌లో ఎక్కువ పతకాలు రావడం ఇంకా ఆనందంగా ఉంది. అథ్లెటిక్స్‌తో పాటు రోయింగ్, ఆర్చరీ, షూటింగ్, సెయిలింగ్, రెజ్లింగ్‌లోనూ మన అథ్లెట్లు మంచి ప్రదర్శన చేశారు. ఇది భారత క్రీడా రంగంలో నవ శకానికి నాంది. ఆటల్లో మన దేశం అభివృద్ధి చెందుతుందనేందుకు ఇది నిదర్శనం.
గత మూణ్నాలుగేళ్లలో భారత అథ్లెటిక్స్‌లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. ముఖ్యంగా టోక్యో ఒలింపిక్స్‌లో మీరు సాధించిన పసిడి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. దీనిపై మీ అభిప్రాయం?
ప్రస్తుతం క్రీడల్లో ఉన్న యువ ప్లేయర్స్ ఆరంభం నుంచే అథ్లెటిక్స్‌లో రాణిస్తున్నారు. ఛాంపియన్లుగా నిలవాలనే మానసిక దృక్పథాన్ని ప్రదర్శిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వంతో పాటు ప్రైవేటు స్పాన్సర్లు కూడా వీరికి అండగా నిలుస్తున్నారు. అన్ని రకాలుగా మద్దతు దొరుకుతుండటం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. ఒలింపిక్స్‌లో నా పసిడి మరెంతో మంది అథ్లెట్లను అందిస్తుందంటే అది ఆనందమే. ఇప్పుడు చాలా మంది జావెలిన్ త్రోలో కెరీర్ కొనసాగించాలని అనుకుంటున్నారు. నీరజ్ చోప్రాలా కావాలని తల్లిదండ్రులు తమ పిల్లలకు చెబుతుంటే ఎంతో సంతోషంగా ఉంది.
ఆసియా క్రీడల ఫైనల్లో మీ తొలి త్రోను నమోదు చేయలేదు.. మళ్లీ విసరమన్నారు అప్పుడు ఏం జరిగింది?
నా శైలిలో పరుగెత్తుకుంటూ వచ్చి త్రో విసిరాను. మంచి దూరమే వేశానని నాకు అనిపించింది. అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాను. కానీ వారు ఏం చెప్పడం లేదు. కొంతసేపటి తర్వాత ప్రతినిధులు వచ్చి ఆ త్రోను నమోదు చేయలేదు మళ్లీ విసరాలని కోరారు. దీంతో కొంత ఆందోళన చెందినప్పటికీ మళ్లీ పోరుకు సిద్ధమయ్యాను. అలాగే కిశోర్ కుమార్ విషయంలో మొదట ఫౌల్ అని ప్రకటించి తర్వాత అదేం లేదన్నారు. అంతకుముందు జ్యోతి యర్రాజి విషయంలోనూ ఇలాగే జరిగింది. ఇవన్నీ సాంకేతిక తప్పిదాలేనని చెప్పారు.
టోక్యో ఒలింపిక్స్ పసిడికి ముందు, ఆ తర్వాత మీ జీవితం ఎలా ఉంది?
చాలా మారింది. ఇప్పుడందరూ నన్ను గుర్తుపడుతున్నారు. నీరజ్ చోప్రా అనే పేరు అందరికీ తెలిసింది. ఇంకా ఈ జీవితం చాలా ఉంది. మరిన్ని మంచి విషయాలు జరుగుతాయని ఆశిస్తున్నాను. గాయాలను దాటుకుని ముందుకు వెళ్లాలి అదే నా ముఖ్య లక్ష్యం. సాధించిన విజయాల పట్ల సంతృప్తితో ఉన్నాను. కానీ ఇంకా అందుకోవాల్సి చాలా ఉంది. టైటిళ్లను కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. నిరంతర సాధన కొనసాగిస్తూ ప్రదర్శన మెరుగుపర్చుకోవాలి.
మిమ్మల్ని గోల్డెన్ బాయ్ అని పిలుస్తున్నారు. మీపై ఎప్పుడూ అంచనాలుంటున్నాయి. ఒత్తిడికి గురవుతున్నారా?
అంచనాలనేవి ఎప్పుడూ ఉంటాయి. ఏదైనా గాయమైనప్పుడు దీన్ని దాటాలని, పతకాలు గెలవాలని అనుకుంటాను. సవాళ్లను అధిగమించేందుకు ప్రయత్నిస్తాను. మన విజయం కోసం దేశం ఎదురు చూస్తుందంటే ఎంతో గొప్పగా అనిపిస్తోంది. అందుకే ఎప్పటికప్పుడు మెరుగ్గా రాణించి అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసేందుకు ప్రయత్నిస్తుంటాను. బహుశా ఈ అంచనాలే నాలో స్ఫూర్తిని రగిలిస్తున్నాయని చెప్పొచ్చు.
పారిస్ ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ నుంచి ఎన్ని పతకాలు ఆశించవచ్చు?
ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్ ప్రదర్శన కొత్త ఆశలు రేకిత్తిస్తోంది. వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరగనున్న ఒలంపిక్స్‌లో అథ్లెటిక్స్‌లో కచ్చితంగా చెప్పుకోదగ్గ స్థాయిలో పతకాలు వస్తాయని చెప్పగలను. గత క్రీడల కంటే కనీసం ఒక పతకం ఎక్కువే వస్తుంది.
నీరజ్ ఎప్పుడు 90 మీటర్ల దూరాన్ని అందుకుంటాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ దిశగా మీ ప్రయాణం ఎలా సాగుతోంది?
నేను కూడా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదలతోనే ఉన్నాను. ఆ దిశగా నా టెక్నిక్‌ను మరింత మెరుగుపర్చుకుంటున్నాను. త్వరలోనే ఈ మార్కును చేరుకుంటానని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాను.
యువ అథ్లెట్లకు, చిన్నారులకు మీరిచ్చే సందేశం?
ఒక లక్ష్యంతో ముందుకు సాగాలి. మన ప్రయాణం ఎప్పుడూ సాఫీగా ఉండదు. ఇప్పుడు శిక్షణ, వసతి సౌకర్యాలు మెరుగయ్యాయి. కానీ నా కెరీర్ మొదట్లో ఇవన్నీ లేవు. రోడ్డుపై పరుగెత్తేవాణ్ని. ఇప్పుడు పరిస్థితి మెరుగైంది. అయినా వసతులు సరిగ్గా లేవని ఆగిపోవద్దు. వందశాతం ప్రయత్నించాలి. ఫలితాలు అనేవి నెమ్మదిగా వస్తాయి. ఓపికతో ఉండాలి. ఆటపై ఇష్టంతో ముందుకు సాగతుండాలి.
హైదరాబాద్‌తో మీ అనుబంధం?
2015లో జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ కోసం ఇక్కడికి వచ్చాను. అప్పుడు గోల్కొండ కోట మెట్లపై పరుగెత్తాను. ఇప్పుడు ఏడేళ్ల తర్వాత మళ్లీ వచ్చాను. ఈ నగరం ఎంతో మారిపోయింది. ఎంతో అభివృద్ధి చెందింది. గోపీచంద్ అకాడమీకి వెళ్లాను. మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఒలింపిక్ ఛాంపియన్ అవుతాననే అనుకోనే లేదు. కానీ ఇప్పుడు ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్‌గా ఇక్కడ అడుగుపెట్టాను. కష్టపడుతూ సాగితే కచ్చితంగా ఫలితాలు వస్తాయి.
Neeraj Chopra Won Gold Medal : గోల్డ్ గెలిచిన నీరజ్ చోప్రా.. సిల్వర్‌తో మెరిసిన కిషోర్ జెనా