Neeraj Chopra Zurich Diamond League : తన అద్భుత ప్రదర్శనతో రికార్డులు తిరగరాయడం అలవాటు చేసుకున్న భారత జావెలిన్ త్రో స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరో చరిత్ర ముంగిట నిలిచాడు. డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో ఛాంపియన్‌గా నిలిచిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో గురువారం ఆరంభమయ్యే ఈ పోటీల్లో బరిలో దిగుతున్నాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో చారిత్రక రజతం తర్వాత గజ్జల్లో గాయం కారణంగా అతను కామన్వెల్త్ క్రీడలకు దూరమైన సంగతి తెలిసిందే. గాయం నుంచి కోలుకున్న అతను.. డైమండ్ లీగ్ లూసానె అంచె పోటీల్లో పసిడి పట్టాడు. ఆ పోటీల్లో ఈటెను 89.08 మీటర్ల దూరం విసిరిన ఈ 24 ఏళ్ల ఒలింపిక్ ఛాంపియన్.. ఫైనల్స్‌లో 90మీ.లక్ష్యాన్ని అందుకుంటాడేమో చూడాలి.
గతంలో రెండు సార్లు ఫైనల్స్‌కు అర్హత సాధించిన అతను.. వరుసగా ఏడు (2017), నాలుగు (2018) స్థానాల్లో నిలిచాడు. 32 క్రీడాంశాల్లో జరిగే 13 సిరీస్‌ల్లో సాధించిన పాయింట్ల ఆధారంగా అథ్లెట్లు ఈ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. జావెలిన్ త్రోలో నాలుగో స్థానం (15 పాయింట్లు)తో నీరజ్ ఈ పోటీల్లో తలపడే అవకాశం దక్కించుకున్నాడు. ఆరుగురు అథ్లెట్లు తలపడే ఈ ఫైనల్స్‌కు గాయాల కారణంగా ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో నీరజ్‌కు ప్రధానంగా ఒలింపిక్ రజత విజేత జాకబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్) నుంచి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సీజన్లో 90 మీటర్లకు పైగా ప్రదర్శన చేసిన జాకబ్‌తో తలపడ్డ అన్ని సార్లు నీరజ్ విజేతగా నిలవడం కలిసొచ్చే అంశం.
ఇదీ చదవండి: ఊరట విజయం కోసం టీమ్ఇండియా ఎదురుచూపులు.. నేడు అఫ్గానిస్థాన్‌తో ఢీ
ఎవరీ బ్యూటీ.. అర్షదీప్ బౌలింగ్‌కు ఫిదా.. పెళ్లి చేసుకోవాలంటూ..