లాక్‌డౌన్ కారణంగా బోసిపోయిన మైదానాలకు తిరిగి కాస్త కళ రానుంది. ప్రేక్షకులు లేకుండా స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లలో కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం తాజాగా అనుమతిచ్చింది. దీంతో జాతీయ క్రీడా సమాఖ్యలు ఆటల పునరుద్ధరణకు సన్నద్ధమవుతున్నాయి. కనీసం ఒలింపిక్స్‌లో పోటీ పడే అథ్లెట్లు సాధన చేసేందుకైనా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నాయి.
మొత్తం 13 బరువుల విభాగాల్లో త్వరలో వెయిట్ లిఫ్టర్లకు శిక్షణ ఆరంభిస్తామని భారత రెజ్లింగ్ సమాఖ్య సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ చెప్పారు. పటియాలా, సోనేపట్ సాయ్ కేంద్రాల్లో శిబిరాలను నిర్వహిస్తారు. శిక్షణ, పోటీల పునరుద్ధరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జాతీయ షూటింగ్ సమాఖ్య తెలిపింది. శిక్షణ శిబిరంలో చేరేందుకు లిఖిత పూర్వకంగా అంగీకారం తెలపాలని 16 మంది అగ్రశ్రేణి టీటీ ఆటగాళ్లను జాతీయ టీటీ సమాఖ్య కోరింది. అయితే ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో అథ్లెట్లను స్టేడియాలకు ఎలా తీసుకురావాలన్నది ప్రశ్న.
"అగ్రశ్రేణి బాక్సర్లు శిబిరాల్లో ఎలా చేరతారు. చాలా మంది ఇంటి వద్ద ఉన్నారు. కొందరు కోచ్‌లూ ఇంటికెళ్లిపోయారు" అని ఓ బాక్సింగ్ అధికారి తెలిపారు. "శిబిరంలో చేరిన బాక్సర్లకు కరోనా పరీక్షలు చేసి, ఆ తర్వాత క్వారంటైన్‌కు తరలించాలి. లాక్‌డౌన్ ముగిసే వరకు క్రీడా కార్యకలాపాల నిర్వహణ కష్టమే" అని చెప్పారు.
అథ్లెట్ల హర్షం
స్టేడియాలు తెరవడానికి ప్రభుత్వం అనుమతించడంపై క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. "ఇది క్రీడలకు శుభవార్త. షూటింగ్ రేంజ్‌లో సాధన చేయడానికి నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. కానీ కరోనా కారణంగా అది సాధ్యం కాలేదు. ఇప్పుడు నిబంధనల ప్రకారం సాధనను తిరిగి మొదలు పెడతాం" అని షూటర్ అభిషేక్ వర్మ అన్నారు. "అథ్లెట్ల ఒలింపిక్ సన్నాహకాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. స్టేడియాలు తిరిగి తెరిచేందుకు అనుమతించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు" అని రెజ్లర్ బబిత ఫొగాట్ చెప్పారు.
ఇదీ చూడండి.. అక్టోబర్‌లో ఐపీఎల్: లీగ్ నిర్వహణకు సన్నాహాలు!