క్రీడా చరిత్రలో ఇటీవల పెను విషాదానికి కేంద్రంగా నిలిచిన ఇండోనేషియాలోని కంజురుహాన్ ఫుట్‌బాల్ స్టేడియాన్ని కూల్చివేయనున్నారు. దేశ అధ్యక్షుడు జోకో విడోడో మంగళవారం ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ స్టేడియాన్ని కూల్చివేసి, అన్ని భద్రతా ప్రమాణాలతో పునర్నిర్మిస్తామని వెల్లడించారు. మరోవైపు.. దేశంలో ఫుట్‌బాల్‌ను సంస్కరించేందుకు అన్ని విధాలా సాయం అందిస్తామని ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్‌ఫాంటినో హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన జకర్తాలో విడోడోతో భేటీ అయ్యారు. ఈ దేశంలో వచ్చే ఏడాది అండర్-20 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ జరగనుంది.
అక్టోబర్ 1న తూర్పు జావా ప్రావిన్స్‌లోని కంజురుహాన్ ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 133 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ రోజును.. ఫుట్‌బాల్ క్రీడా చరిత్రలో చీకటి రోజుల్లో ఒకటిగా ఇన్‌ఫాంటినో అభివర్ణించారు. ఫిఫా ప్రమాణాలతో నిర్మించనున్న కొత్త స్టేడియంలో క్రీడాకారులు, ప్రేక్షకుల భద్రతకు అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. 'ఇండోనేషియాలో ఫుట్‌బాల్‌ను సంస్కరిస్తాం. మ్యాచుల నిర్వహణ విషయంలో మార్పులు తీసుకొస్తాం' అని ఇన్‌ఫాంటినో తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వంతోపాటు ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య, ఇండోనేషియా ఫెడరేషన్‌తో కలిసి పని చేస్తామన్నారు.
స్టేడియాల నిర్వహణ, అభిమానుల ప్రవర్తనను మెరుగుపరచడం, పాఠశాలల్లో ఫుట్‌బాల్ సంబంధిత కార్యక్రమాలు రూపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది మే- జూన్ మధ్యలో స్థానికంగా నిర్వహించే అండర్-20 ఫుట్‌బాల్ ప్రపంచకప్ సురక్షితంగా సాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఇండోనేషియాలోనే ఉన్న ఫిఫా, ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య ప్రతినిధులు.. ఇటీవలి తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు.. విచారణ ప్రక్రియ పూర్తయ్యే వరకు దేశంలోని అన్ని ఫుట్‌బాల్ మ్యాచ్‌లను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు దేశాధ్యక్షుడు విడోడో ఇప్పటికే ప్రకటించారు. అన్ని స్టేడియాల భద్రతపై సమీక్షకు ఆదేశించారు.