ఖతర్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెట్ ఛాంపియన్‌షిప్‌లో భారత మిక్స్డ్ రిలే జట్టు సత్తాచాటింది. ఈ సీజన్లో ఉత్తమ ప్రదర్శన చేస్తూ.. ఫైనల్లో ప్రవేశించింది. శుక్రవారం జరిగిన హీట్స్‌లో మహ్మద్ అనాస్, విస్మయ, జిస్నా మాథ్యూ, నిర్మల్ తోమ్‌లతో కూడిన భారత జట్టు 3:16.14 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరి మూడో స్థానంలో నిలిచి ఒలింపిక్స్ బెర్తూ ఖరారు చేసుకుంది.
తొలి లెగ్‌లో మహ్మద్ అనాస్ వేగంగా పరుగెత్తి విస్మయకు బ్యాటన్ అందించగా..ఈ కేరళ అథ్లెట్ అందరిని ఆశ్చర్యపరుస్తూ రేసులో అగ్రస్థానంలో దూసుకెళ్లింది. ఆమె నుంచి బ్యాటన్‌ను అందుకున్న జిస్నా మాథ్యూ.. విస్మయ అంత వేగంగా పరుగెత్తలేకపోయింది. నిర్మల్ తోమ్‌కు బ్యాటన్ అందించడంలోనూ తడబడింది. అయితే చివరి 400 మీటర్లలో గొప్పగా దూసుకెళ్లిన నిర్మల్.. రేసును మూడో స్థానంతో ముగించాడు. ఇదే విభాగంలో అమెరికా జట్టు (3:12.42 ని) ప్రపంచ రికార్డు సృష్టిస్తూ అగ్రస్థానంలో నిలిచింది.
ద్యుతి తొలిరౌండ్లోనే..
హాట్‌ఫేవరెట్‌గా బరిలో దిగిన ద్యుతిచంద్ తొలిరౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. 100 మీటర్ల పరుగులో హీట్-3లో తలపడిన ద్యుతి.. 11.48 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఏడో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఆసియా ఛాంపియన్‌షిప్ హీట్స్‌లో 11.28, సెమీఫైనల్లో 11.26 సెకన్ల (జాతీయ రికార్డు) టైమింగ్ నమోదు చేసిన ద్యుతి.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది.
ఇదీ చదవండి: అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ నుంచి ద్యుతి ఔట్..!