బాక్సింగ్, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడల్లో బరిలోకి దిగే ఆటగాళ్లకు.. బరువు ప్రధాన సమస్య. ఎన్నో రోజులు కఠోర సాధన చేసినా.. మ్యాచ్ ప్రారంభానికి ముందు వారి విభాగానికి మించి కొద్ది బరువు ఉన్నా అనర్హతకు గురవుతారు. ఉదాహరణకు 48 కిలోల లైట్ ఫ్లై వెయిట్ విభాగంలో పోటీ పడితే కచ్చితంగా 48 లేదా అంతకంటే తక్కువ ఉండాల్సిందే. ఆ పరిమితికి మించి పెరిగితే ఆటగాళ్లు పోటీపడే అవకాశమే కోల్పోతారు. మరి అలాంటి సమస్యను క్రీడాకారులు ఎలా అధిగమిస్తారు..? బరువు అడ్డంకులను గంటల్లో ఎలా తొలగించుకుంటారో చూద్దాం.
సఫలమైన మేరీ ప్రయత్నం..
భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్.. దేశ, అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటుతోన్న క్రీడాకారిణి. రింగ్‌లోకి అడుగుపెడితే ప్రత్యర్థులకు ముచ్చెమటలు తప్పవు. 2001 నుంచి ఇప్పటివరకు తనదైన ప్రదర్శనతో దూసుకెళ్లిన ఈ స్టార్‌కు ఇటీవల ఓ ఇబ్బంది ఎదురైంది. బాక్సింగ్ రింగ్‌లోకి దిగడానికి ముందే బరువు రూపంలో ఓ అడ్డంకి ఏర్పడింది.
- ఏమైంది..?
2018లో పోలండ్ వేదికగా జరిగిన సిలేసియన్ బాక్సింగ్ టోర్నీలో 48కేజీల విభాగంలో పోటీపడిన మేరీకోమ్.. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు 50 కిలోలు ఉంది. అంటే కచ్చితంగా పోటీల్లో అనర్హతకు గురవుతుంది. అయితే ఆటకు ముందు బరువు పరిశీలించే కార్యక్రమానికి మరో 4 గంటలే సమయం ఉంది. కంగారు లేకుండా వెంటనే బరువు తగ్గించుకోవడంపై దృష్టి సారించింది. కేవలం 4 గంటల్లోనే 2 కిలోల బరువు తగ్గింది. అంతేకాదు ఈ టోర్నీలో స్వర్ణం గెలిచింది.
1. ద్రవ పదార్థాలతో సమస్య..
ఆటగాళ్లు మ్యాచ్‌లకు హాజరయ్యే ముందు ఆకలి తీర్చుకోడానికి ఘన ఆహారం కన్నా.. నీళ్లు, పండ్ల రసాలు వంటి ద్రవ పదార్థాలు తాగుతారు. ఆహారం కూడా కేలరీల ప్రకారం లెక్కేసుకుని తినాల్సి ఉంటుంది. అయితే కొన్నిసార్లు నీళ్లు తాగడం వల్ల కూడా బరువు పెరుగుతారు. అందుకే రెండు రోజుల ముందు నుంచి నీటిని తాగటం తగ్గిస్తారు. మేరీ కూడా కొన్ని గంటల ముందు నీటిని దూరంపెట్టింది.
2. స్కిప్పింగ్...
వేగంగా ఆడే ఆటల వల్ల తక్కువ సమయంలో ఎక్కువ చెమట చిందిచవచ్చు. స్కిప్పింగ్ వంటి ఆట ఇందులో ప్రధానపాత్ర పోషిస్తుంది. ఈ స్టార్ ప్లేయర్ కూడా అదే చేసింది. ఉక్కపోతగా ఉండే గదిలో దాదాపు రెండు గంటల పాటు స్కిప్పింగ్, స్ట్రెచింగ్ చేసింది.
అయితే ఇలా గంటల్లో చెమట రూపంలో నీరు కోల్పోతే.. డీ హైడ్రేషన్ వచ్చి బలహీనంగా తయారైపోతారు. దీని వల్ల క్యాటగిరీకి చెందిన బరువు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అందుకే తెల్లవారే సమయంలో ఎక్కువగా ఈ పని చేస్తారు. కండరాలు బాధపెట్టినా శ్రమిస్తారు. మ్యాచ్‌కు అర్హత సాధించడం.. పతకం తేవడం కంటే కష్టమంటారు కొందరు ఆటగాళ్లు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
3. ఇది మంచిదేనా..?
సరైన ఆహారం తీసుకోకుండా, ఎక్కువ సమయం ఇలా కసరత్తులు చేయడం వల్ల శరీరానికి కొంచెం ఇబ్బందులు ఉన్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ దాని పనితనం మార్చుకుంటుందట. డీ హైడ్రేషన్ సమస్యతో పాటు అవయవాలు దెబ్బతినటం, పెరాలసిస్ వంటి సమస్యలు వస్తాయట. కొన్ని గంటల వరకు పర్వాలేదు కానీ ఎక్కువ రోజులు కొనసాగిస్తే ముప్పే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.