ఫిడె ప్రపంచ మహిళల టీమ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో(World Chess Championship) భారత్ తొలిసారి పతకం సాధించింది. శనివారం ముగిసిన టోర్నమెంట్లో భారత అమ్మాయిలు రజతం సొంతం చేసుకున్నారు. ఈ ఈవెంట్ ఆద్యంతం అంచనాల్ని మించి రాణిస్తూ తొలిసారి ఫైనల్‌కు చేరుకున్న భారత బృందం.. తుది పోరులో రష్యాకు తలవంచింది. ఫైనల్ తొలి రౌండ్లో 1.5-2.5 తేడాతో ఓడిన భారత అమ్మాయిలు.. రెండో రౌండ్లో 1-3తో పరాజయం పాలయ్యారు.
తొలి రౌండ్ ఆరంభ గేమ్‌లో తెలుగమ్మాయి ద్రోణవల్లి హారిక(harika dronavalli latest news).. అలెగ్జాండ్రా గోర్యచినాపై విజయంతో భారత్‌కు అద్భుత ఆరంభాన్నందించింది. అయితే రెండో గేమ్‌లో వైశాలి.. అలెగ్జాండ్రా కోస్తెనిక్ చేతిలో ఓడటంతో స్కోరు సమమైంది. మూడో గేమ్‌లో భక్తి కులకర్ణి.. కేతరినా లాగ్నో చేతిలో ఓడింది. ఎలీనా కష్లిన్‌స్కాయాతో చివరి గేమ్‌ను మేరీ ఆన్‌గోమ్స్ డ్రాగా ముగించింది. రెండో రౌండ్లో భారత్ గెలుపు రుచే చూడలేదు. తొలి గేమ్‌లో హారిక.. అలెగ్జాండ్రా గోర్యచినాతో డ్రా చేసుకోగా, రెండో గేమ్‌లో అలెగ్జాండ్రా కోస్తెనిక్‌తో వైశాలి పాయింట్లు పంచుకుంది. మూడో గేమ్‌లో తానియా సచ్‌దేవ్.. కేతరినా లాగ్నో చేతిలో ఓటమి పాలైంది. చివరి గేమ్‌లో మేరీ ఆన్‌గోమ్స్‌కు సైతం ఓటమి తప్పలేదు. ఆమె.. పొలీనా షువలోవాకు తలవంచింది. సెమీఫైనల్లో భారత్.. జార్జియాను ఓడించింది.
ఇదీ చదవండి:IPL 2021: 'వార్నర్లానే రైనానూ పక్కనపెట్టేయొచ్చు'