హాకీ ప్రపంచకప్ టోర్నీలో భారత్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గురువారం పూల్-డీలో జరిగిన మ్యాచ్‌లో వేల్స్ జట్టుపై 4-2 తేడా విజయం సాధించింది. భారత ఆటగాళ్లలో ఆకాశ్ దీప్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తమ ఆటతీరుతో జట్టును విజయ పథంలో నడిపించారు. మ్యాచ్ 21వ నిమిషంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ గోల్‌కు ప్రయత్నించగా దాన్ని వేల్స్ ఆటగాడు అడ్డుకున్నాడు. వెంటనే మరో భారత ఆటగాడు షంషేర్ బంతిని అందుకుని గోల్ కొట్టి ఖాతా తెరిచాడు. తర్వాత 32వ నిమిషంలో ఆకాశ్‌దీప్ రెండో గోల్ చేశాడు.
రెండో క్వార్టర్‌లో వేల్స్ జట్టు రెండు వరుస గోల్స్ కొట్టింది. 42వ నిమిషంలో గారెత్ ఫర్లాంగ్, 44వ నిమిషంలో జాకబ్ డ్రేపర్ గోల్స్ చేశారు. దీంతో ఇరుజట్ల స్కోర్లు సమం అయ్యాయి. 45వ నిమిషంలోనే భారత ఆటగాడు ఆకాశ్‌దీప్ మరో గోల్, తర్వాత 59వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ పెనాల్టీ గోల్ కొట్టడంతో భారత్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వరల్డ్‌కప్‌లో భాగంగా గత వారం స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-0 భారత్ విజయం సాధించింది. తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఇరు జట్లకు చెరో నాలుగు పాయింట్లు దక్కాయి. ప్రస్తుతం పూల్-డీలో చెరో ఏడు పాయింట్లతో ఇంగ్లాండ్ మొదటి స్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది.