భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖితమైంది. భారత్ థామస్ కప్ విజేతగా నిలిచింది. ఇండోనేషియాపై భారత్ 3-0 తేడాతో విజయం సాధించింది. థామస్ కప్‌లో 14 సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియాను ఓడించిన భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫైనల్ పోరులో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో జయకేతనం ఎగురవేసి విజయం సాధించింది.
సింగిల్స్‌లో ఆంటోని గింటింగ్‌తో తలపడిన భారత యువ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్యసేన్.. తొలిరౌండ్‌లో 8-21తో వెనుకబడినా మిగతా రెండు రౌండ్లలో అనూహ్యాంగా పుంజుకొని 21-17, 21-16 తేడాతో విజయాన్ని నమోదు చేశాడు. అటు డబుల్స్‌లోనూ.. భారత ఆటగాళ్లు అదరగొట్టారు. ఇండోనేషియా జోడి అసాన్, సంజయపై సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి గెలుపొందింది. 18-21, 23-21, 21-19 తేడాతో జయకేతనం ఎగురవేసింది. జొనాథన్ క్రిస్టీపై కిదాంబి శ్రీకాంత్ 21-15, 23-21 ఆధిక్యంతో విజయం సాధించాడు.
ప్రధాని మోదీ ప్రశంస: థామస్ కప్ గెలిచిన భారత జట్టుకు అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. "భారత బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. థామస్ కప్ గెలవడం పట్ల యావద్దేశం సంతోషంగా ఉంది. భవిష్యత్‌లో మన ఆటగాళ్లు మరిన్ని విజయాలు సాధించాలి. ఈ విజయం వర్ధమాన ఆటగాళ్లకు ఎంతో స్ఫూర్తినిస్తుంది" అని మోదీ పేర్కొన్నారు.
రూ.కోటి నజరానా: థామస్ కప్ గెలిచిన పురుషుల జట్టుకు అభినందనలు తెలియజేశారు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. "మలేషియా, డెన్మార్క్, ఇండోనేషియాలపై వరుస విజయాలతో సాధించిన ఈ అసాధారణ ఘనత పట్ల దేశం నీరాజనాలు పలుకుతోంది. తొలిసారి ఈ కప్‌ను ముద్దాడిన జట్టుకు రూ.కోటి నగదు బహుమానం అందించనున్నట్లు ప్రకటించడానికి గర్వపడుతున్నా." అని అనురాగ్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: జూనియర్ ప్రపంచకప్.. పసిడితో మెరిసిన తెలుగు తేజాలు