World Youth Boxing Champion Ship 2022 : స్పెయిన్‌లో జరుగుతున్న ప్రపంచ యూత్ బాక్సింగ్ టోర్నీలో భారత్ పంచ్ అదిరింది. ఈ పోటీల్లో మూడు స్వర్ణాలు కైవసమయ్యాయి. విశ్వనాథ్ (48 కేజీ), వంశజ్ (63.5 కేజీ), దేవిక (52 కేజీ) పసిడి పతకాలతో మెరిశారు. రోనెల్ (ఫిలిప్ఫీన్స్)ను విశ్వనాథ్ ఓడించగా.. డెముర్ (జార్జియా)పై వంశజ్ నెగ్గాడు. సకాయ్ (జపాన్) చేతిలో పరాజయం పాలైన ఆశిష్ (54 కేజీ) రజతంతో సరిపెట్టుకున్నాడు.
మహిళల విభాగంలో లౌరెన్ (ఇంగ్లాండ్)పై దేవిక పైచేయి సాధించగా.. గనెవా (ఉజ్బెకిస్థాన్) చేతిలో తలొంచిన భావ్నాశర్మ (48 కేజీ) రజతంతో సంతృప్తి పడింది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా మూడు స్వర్ణాలు సహా 11 పతకాలు సాధించిన భారత్ అగ్రస్థానంలో నిలిచింది. మహిళల విభాగంలోనే మనకు ఎనిమిది పతకాలు దక్కడం విశేషం. రవీనా (63 కేజీ), కీర్తి (81 కేజీలపైన) పసిడి పోరుకు అర్హత సాధించిన నేపథ్యంలో మరో రెండు స్వర్ణాలు ఖాతాలో చేరే అవకాశాలున్నాయి.
ఛాలెంజర్ విజేత భారత్-డి
మహిళల టీ20 ఛాలెంజర్ ట్రోఫీలో భారత్-డి విజేతగా నిలిచింది. యస్తికా భాటియా (80 నాటౌట్) చెలరేగడంతో శనివారం ఫైనల్లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో భారత్-ఎను ఓడించింది. మొదట 'ఎ' 144/5 స్కోరు చేసింది. హర్లీన్ డియోల్ (61; 48 బంతుల్లో 8×4, 1×6), పర్వీన్ (50; 43 బంతుల్లో 6×4) రాణించారు. 'డి' బౌలర్లలో రేణుక (3/24), రాజేశ్వరి (2/21) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఛేదనలో జసియా (47)తో కలిసి తొలి వికెట్‌కు 70 పరుగులు జత చేసిన యస్తికా ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేసింది. ఆ తర్వాత వరుసగా వికెట్లు చేజారినా.. సుష్మ (13 నాటౌట్) తోడుగా యస్తికా జట్టును గెలిపించింది. భారత్-డి 19 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.