ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్స్‌లో క్రొయేషియా! జపాన్ భయపెట్టినా ఆ జట్టు తగ్గలేదు. క్రొయేషియా తన అనుభవాన్నంతా రంగరించి, తనలోని అత్యుత్తమ ఆటను వెలికితీసి, ఒత్తిడిని చిత్తు చేస్తూ విజయాన్ని అందుకుంది. సోమవారం నువ్వానేనా అన్నట్లు సాగిన ప్రిక్వార్టర్స్‌లో ఆ జట్టు పెనాల్టీ షూటౌట్లో 3-1తో జపాన్‌పై విజయం సాధించింది.
మొదట జపాన్‌కు ఆధిక్యం: ఈ మ్యాచ్‌లో ఆరంభం క్రొయేషియాదే. తొలి 30 నిమిషాల్లో రెండుసార్లు ఆ జట్టు గోల్‌ను త్రుటిలో కోల్పోయింది. జపాన్ డిఫెన్స్ లోపాలను సొమ్ము చేసుకుంటూ ఎనిమిదో నిమిషంలో బాక్స్ సమీపానికి దూసుకొచ్చిన క్రొయేషియా ఆటగాడు ఇవాన్ పెర్సీచ్.. ప్రత్యర్థి డిఫెండర్‌ను బోల్తా కొట్టిస్తూ ముందుకెళ్లాడు. కానీ ఫినిషింగ్ చేయడంలో విఫలమయ్యాడు. తడబడి బంతిని కొంచెం క్రాస్‌గా కొట్టడంతో అది నెట్ పక్క నుంచి వెళ్లిపోయింది. 28వ నిమిషంలో పెర్సీచ్ మరోసారి జపాన్ రక్షణశ్రేణికి పరీక్ష పెట్టాడు. కార్నర్ నుంచి అతడు నేరుగా ఇచ్చిన క్రాస్‌ని గోల్ ప్రాంతంలో క్రొయేషియా ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు.
అక్కడ నుంచి జపాన్ నెమ్మదిగా దాడులకు దిగింది. క్రొయేషియాను కాచుకుంటూనే బంతిని నియంత్రణలోకి తెచ్చుకున్న ఆ జట్టు వ్యూహాత్మక పాస్‌లతో ప్రత్యర్థి గోల్ ప్రాంతంలోకి పదే పదే ప్రవేశించింది. 41వ నిమిషంలో కమాడా కొట్టిన ఓ షాట్ క్రొయేషియా గోల్‌బార్ పైనుంచి వెళ్లిపోయింది. ఆ కాసేటికే జపాన్ శ్రమ ఫలించింది. ప్రత్యర్థికి షాక్ ఇస్తూ ప్రథమార్థం ఆఖర్లో డైజన్ (43వ) జపాన్ ఖాతా తెరిచాడు. గోల్ ఇచ్చామన్న నిస్పృహ ఒకవైపు వెంటాడుతున్నా బ్రేక్ తర్వాత క్రొయేషియా దూకుడుగా ఆడింది. వారి ప్రయత్నాలకు త్వరగా ఫలితం వచ్చింది. తన మూడో ప్రయత్నంలో పెర్సీచ్ (55వ) సఫలమయ్యాడు. సహచరుడి నుంచి ఓ ఫ్రీకిక్‌ను అందుకున్న అతడు హెడర్‌తో బంతిని నెట్‌లోకి పంపేశాడు. స్కోరు 1-1గా నిలవడం, నిర్ణీత సమయంలో మరో గోల్ పడకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి మళ్లింది.
షూటౌట్లో..: ఎక్స్‌ట్రా టైమ్‌లో జపాన్ గోల్ చేసినంత పని చేసింది. మైదానం మధ్యలో బంతిని దొరకబుచ్చుకున్న మిటోమా 105వ నిమిషంలో ఒక్కో డిఫెండర్‌ను తప్పిస్తూ ఓ శక్తిమంతమైన షాట్ కొట్టాడు. కానీ దీన్ని క్రొయేషియా కీపర్ లివకోవిచ్ సమర్థంగా అడ్డుకున్నాడు. ఈ క్రమంలోనే జపాన్ ఆటగాళ్లు మరోసారి షాట్ కొట్టినా కీపర్ వారి ప్రయత్నాలకు అడ్డుపడ్డాడు. ఆ తర్వాత జపాన్ మరో విఫలయత్నం చేసింది. అదనపు సమయంలోనూ గోల్స్ కాకపోవడంతో మ్యాచ్ షూటౌట్‌కు మళ్లింది. షూటౌట్లో తన తొలి రెండు ప్రయత్నాల్లో జపాన్ (మినామినో, మిటోమా) విఫలం కాగా.. క్రొయేషియా (వ్లాసిచ్, బ్రొజోవిచ్) సఫలమైంది. క్రొయేషియా గోల్‌కీపర్ లివకోవిచ్ జపాన్ తొలి రెండు పెనాల్టీను అడ్డుకున్నాడు. క్రొయేషియా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో షాట్‌కు జపాన్ (తకూమా) గోల్ చేయగా.. క్రొయేషియా విఫలం (మార్కో) కావడంతో స్కోరు 1-2తో ఆసక్తికరంగా మారింది. కానీ నాలుగో ప్రయత్నంలో యొషిదా (జపాన్) విఫలం కాగా.. పెర్సీచ్ (క్రొయేషియా) గోల్ చేయడంతో క్రొయేషియా సంబరాల్లో మునిగిపోయింది.
ఇవీ చదవండి:
'భారత టీ20 లీగ్‌పై గ్రీన్ ఇప్పుడే ఓ నిర్ణయానికి రాడు'
పాక్‌పై ఇంగ్లాండ్ చిరస్మరణీయ విజయం.. జీవం లేని పిచ్‌పై ఫలితం!