టోక్యో ఒలింపిక్స్ ఏడాది పాటు వాయిదా పడడం వల్ల ఆ టోర్నీకి అర్హత సాధించేందుకు మంచి అవకాశం దొరికిందని భారత దిగ్గజ రెజ్లర్ సుశీల్ కుమార్ అంటున్నాడు.
'నా పని అయిపోయింది.. ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తానని అనుకునే వాళ్లు అనుకోనీ. వాళ్ల గురించి పట్టించుకోను. మెరుగ్గా సన్నద్ధమయ్యేందుకు మంచి సమయం దొరికింది. రెజ్లింగ్ లాంటి క్రీడలో గాయాలు కాకుండా జాగ్రత్తగా ఉంటూ, చక్కగా సాధన చేస్తూ.. ఓ లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని అందుకునే దిశగా కృషి చేస్తే కచ్చితంగా ఫలితం దక్కుతుంది. ఫిట్‌నెస్‌ను కాపాడుకునేందుకు శ్రమిస్తున్నా. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాననే నమ్మకంతో ఉన్నా. 2011లోనూ ప్రజలు నా గురించి ఇలాగే మాట్లాడుకున్నారు. దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసు. అది నిత్యకృత్యం అయిపోయింది' -సుశీల్ కుమార్, భారత రెజ్లర్
భారత్ తరఫున రెండు ఒలింపిక్ పతకాలు గెలిచిన ఏకైక రెజ్లర్ సుశీల్. ఇతడు పోటీపడే 74 కేజీల విభాగంలో మన దేశం ఇంకా ఒలింపిక్ బెర్త్ ఖరారు చేయలేదు. ఒలింపిక్స్ వాయిదా పడడం మరో రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కూ కలిసొచ్చే అవకాశం ఉంది. డోపింగ్ కారణంగా అతడిపై విధించిన నాలుగేళ్ల నిషేధం ఈ జులైతో ముగుస్తుంది. అతడు తిరిగి ఆటలోకి వస్తానంటే అనుమతి ఇస్తామని భారత రెజ్లింగ్ సమాఖ్య ఇంతకు ముందే చెప్పింది. ఒకవేళ నర్సింగ్‌తో తలపడే పరిస్థితి వస్తే అప్పుడే దాని గురించి ఆలోచిస్తానని సుశీల్ చెప్పాడు. 'ఆ సమయం వచ్చినపుడు చూద్దాం. ఇప్పుడైతే ఏం చెప్పలేను. తన కెరీర్‌ను మళ్లీ మొదలు పెట్టాలనుకుంటున్న నర్సింగ్‌కు అభినందనలు. అతడికి మంచి జరగాలని కోరుకుంటున్నా' అని సుశీల్ అన్నాడు.