లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ప్రపంచ బాక్సింగ్ రజత పతక విజేత, టాప్‌సీడ్ బాక్సర్ అమిత్ పంగల్.. క్రీడల్లో భారత అత్యున్నత పురస్కారమైన ఖేల్‌రత్నకు తాజాగా నామినేట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో అతడిని 'ఈటీవీ-భారత్' ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ చేసింది. ఇందులో మాట్లాడుతూ ఒలింపిక్స్ కోసం ఎలాంటి సాధన చేస్తున్నాడు? తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించాడు.
లాక్డౌన్లో మీ ప్రణాళిక ఏంటి?
లాక్డౌన్ ముందు క్యాంప్‌లో ఉన్నప్పుడు ఏవిధంగా బాక్సింగ్ శిక్షణ చేసేవాడినో.. ఇప్పుడు ఇంట్లో అలానే ప్రాక్టీసు అవుతున్నా. ఫిట్నెస్ కోల్పోకుండా నిత్యం కసరత్తులు చేస్తున్నాను.
ఒలింపిక్స్‌ను వాయిదా చేస్తున్నట్లు ప్రకటించగానే మీరు మొదట ఎలా స్పందించారు?
ఒలింపిక్స్‌ను వాయిదా వేసినా, వేయకపోయిన రెండూ మంచిదే. ఒకవేళ షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ జరిగితే నా ఫిట్నెస్, విశ్వాసం అలానే ఉన్నాయి. నేను అగ్రశ్రేణి బాక్స్ర్ను కాబట్టి, విశ్వాసం కాస్త ఎక్కువగానే ఉంది. ఈ టోర్నీని వాయిదా వేయడమూ మంచిదే అయింది. దీనివల్ల నా ప్రత్యర్థుల బలబలహీనతలు తెలుసుకోవడానికి మరింత దృష్టి సారించవచ్చు. నాలోని బలహీనతలను మెరుగుపరుచుకునేందుకు ఇదే సరైన సమయం.
నేషనల్ క్యాంప్‌ను మిస్ అవుతున్నారా?
అవును, చాలా మిస్ అవుతున్నాను. అక్కడ ఉండే వాతవరణం ఇంట్లో ఉండదు కదా. అక్కడైతే అందరం కలసి కబుర్లు చెప్పుకోవడం, జోకులు వేసుకోవడం, నవ్వుకోవడం, కలసి తినడం చేస్తాం. ప్రస్తుతం ఇవన్నీ మిస్ అవుతున్నాను.
బాక్సింగ్ కాకుండా మీరు ఇష్టపడే క్రీడలు ఏంటి?
నేను బాక్సింగ్ కాకుండా రెజ్లింగ్, ఫుట్‌బాల్ క్రీడలను ఇష్టపడతాను. ప్రో రెజ్లింగ్ లీగ్ మ్యాచులన్నీ చూస్తాను. ఫుట్‌బాల్ ప్రపంచకప్ చూశాను. రెండుసార్లు ఒలింపిక్ ఛాంపియన్‌గా నిలిచిన ఉక్రెయిన్ బాక్సర్ వశీల్ లొమాచెంకో అంటే చాలా ఇష్టం. నేను అతడినే అనుసరిస్తాను. అతడిలా ఆడేందుకు ప్రయత్నిస్తుంటాను.
భారత బాక్సర్లలో మీ స్నేహితుడు ఎవరు?
భారత బాక్సర్లలో నాకు చాలా మంది మంచి మిత్రులున్నారు. ముఖ్యంగా ఇద్దరు, ముగ్గురుతో కలిసి బాగా సమయాన్ని గడుపుతాను. సంజీత్ కుమార్, బ్రిజేష్ యాదవ్ నా రూమ్మేట్స్ కావడం వల్ల వారితో ఎక్కువ సమయం ఉంటాను.
ఇంట్లో శిక్షణ కాకుండా ఇంకేమి చేస్తున్నారు?
మా ఇంటి డాబాపైన పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగరేస్తున్నాను. వారికి బాక్సింగ్ శిక్షణ ఇస్తున్నాను. నా ప్రత్యర్థుల వీడియోలు, 'మహాభారతం', 'రామాయణం' వంటి సీరియల్స్ చూస్తున్నాను.
మీకిష్టమైన నటీనటులు ఎవరు?
నేను సినిమాలు చూడను. కానీ అక్షయ్‌కుమార్, రణ్‌దీప్ హుడాను ఎక్కువ ఇష్టపడతాను.
డైట్ పాటిస్తున్నారా?
డైట్ పాటించడం నాకు చాలా కష్టమైన విషయం. అందుకే మా అమ్మ ఏది వండిపెడితే అది ఫుల్‌గా తింటున్నాను.
మీ అమ్మ చేతివంటల్లో దేనిని ఎక్కువ ఇష్టపడతారు?
పాయసం, చుర్మా. కొన్నిసార్లు మా అమ్మకు కాఫీ కూడా పెడతాను.
ఇది చూడండి : మేరీకోమ్‌తో వివాదంపై యువ బాక్సర్ నిఖత్ స్పందన