ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణ పతకాల విజేత, చైనా వివాదాస్పద స్విమ్మర్ సన్ యాంగ్‌పై క్రీడా ఆర్బిట్రేషన్ కోర్టు (కాస్) ఎనిమిదేళ్ల నిషేధాన్ని విధించింది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) అప్పీల్‌పై విచారణ చేపట్టిన కాస్.. సన్ డోపింగ్ నేరానికి పాల్పడినట్టు తీర్పు ఇచ్చింది. ఇది వరకే ఒకసారి డోపింగ్ నిషేధానికి గురైన అతడిపై.. రెండోసారి నేరం చేసినందుకు గరిష్ఠంగా ఎనిమిదేళ్ల నిషేధాన్ని విధించింది.
శాంపిల్స్ ధ్వంసం!
2018లో డోప్ పరీక్ష కోసం వాడా సిబ్బంది అతడి ఇంటికి వెళ్లగా శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించాడు. అప్పటికే సిరంజీలో సేకరించిన రక్త నమూనాను నాశనం చేశాడు. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పినా పట్టించుకోలేదు. నేరానికి పాల్పడిన అతడిపై నిషేధం విధించాలని వాడా.. అంతర్జాతీయ స్విమ్మింగ్ సమాఖ్యను కోరింది. అయితే వాడా సిబ్బంది సరైన గుర్తింపు పత్రాలు చూపెట్టనందుకే సన్.. శాంపిల్స్ ఇవ్వలేదని తేల్చిన ఫినా అతడిపై ఎలాంటి శిక్ష విధించలేదు. గతేడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడేందుకూ అనుమతించింది.
సవాల్ చేస్తా..
ఫినా నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వాడా.. కాస్‌ను ఆశ్రయించింది. విచారణలో సన్‌ను డోపీగా తేల్చిన కాస్ ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. అయితే తాజాగా వేటుపై స్పందించిన సన్.. త్వరలో స్విట్జర్లాండ్‌లోని ఫెడరల్ కోర్టులో అప్పీల్ చేస్తానని తెలిపాడు. ఇందుకు చైనా స్విమ్మింగ్ అసోసియేషన్ (సీఎస్‌ఏ) కూడా మద్దతు తెలిపినట్లు సమాచారం. ఫలితంగా ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో ఇతడు పాల్గొనడం సందిగ్ధంలో పడింది. ఇప్పటికే ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు సహా ఆరు పతకాలు గెలిచిన సన్.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 11 పసిడి పతకాలు సహా 16 పతకాలు నెగ్గాడు.