ఒలింపిక్స్ ఫైనల్‌కు ముందు తన జావెలిన్ కనిపించక కంగారు పడ్డాడని.. ఆ జావెలిన్, పాకిస్థానీ ఆటగాడు ఆర్షద్ నదీమ్ చేతిలో ఉందని స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్డా ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై వివాదం చెలరేగింది. ఆర్షాద్ నదీమ్ చేతిలో నీరజ్ జావెలిన్ ఉండటాన్ని తప్పుపడుతూ పలువురు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన నీరజ్.. ఈ వివాదానికి సంబంధించి పలువురు స్పందించిన తీరు తనకు బాధ కలిగిస్తోందన్నాడు. స్వలాభాలకు, దుష్ప్రయోజనాలకు తన పేరు వాడొద్దని స్పష్టం చేశాడు.
అందులో తప్పేమీ లేదు..
ఆర్షాద్ తన జావెలిన్‌ను తీసుకోవడంలో తప్పేమీ లేదన్నాడు నీరజ్.
"ఆ సమయంలో ఆర్షాద్ ఆటకు సన్నద్ధం అయ్యేందుకు నా జావెలిన్ తీసుకున్నాడు. అందులో తప్పేమీ లేదు. అందరి దగ్గర సొంత జావెలిన్లు ఉన్నా మరోకరి జావెలిన్‌ను వాడుకోవచ్చు. ఆ విషయం నిబంధనల్లో కూడా ఉంది. క్రీడలు ఐక్యమత్యాన్ని నేర్పిస్తాయి. తోటి జావెలిన్ ఆటగాళ్లతో అందరం స్నేహపూర్వకంగానే ఉంటాం."
-నీరజ్ చోప్డా, జావెలిన్ అథ్లెట్
నీరజ్ వ్యాఖ్యలను అతని మాజీ కోచ్ సమర్థించారు. ఒకరి జావెలిన్ మరొకరు వాడకూడదని నిబంధన ఏం లేదని తెలిపారు.
ఇదీ చదవండి : టీమ్ఇండియా ఘోర ప్రదర్శన.. తప్పు పిచ్దా?