Disputes in IOC and sports federations of India: మరో అయిదు నెలల్లో కామన్వెల్త్ క్రీడలు జరగబోతున్నాయి. అవి ముగిసిన నెల రోజులకు ఆసియా క్రీడలు మొదలవుతాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ క్రీడలు సాగుతాయి. ఒలింపిక్స్‌కు క్రీడాకారుల సన్నద్ధతలోనూ వాటి పాత్ర కీలకం. రెండు ప్రపంచ స్థాయి క్రీడా పోటీలు దగ్గరపడుతుంటే, అథ్లెట్లను సన్నద్ధం చేయాల్సిన క్రీడా సమాఖ్యలు అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. వాటిలో రాజకీయాలు క్రీడాకారులకు శాపంగా మారుతున్నాయి. క్రీడల విషయంలో డ్రాగన్ దేశం అథ్లెట్లకు లక్ష్యాలను నిర్దేశించి, వారికి అవసరమైన సరంజామా సమకూర్చి, కఠోర శిక్షణ ఇప్పించి పోటీల్లో పతకాల పంట పండించుకుంటోంది. జనాభాలో చైనాకు దీటుగా నిలవడంతోపాటు, క్షేత్ర స్థాయిలో క్రీడా ప్రతిభకు లోటులేని భారత్ మాత్రం ప్రపంచస్థాయి వేదికలపై డ్రాగన్ ముందు వెలాతెలాపోతోంది. చైనా క్రీడాకారులతో మనవాళ్లకు ముఖాముఖి పోటీ ఎక్కువగా ఉండే ఆసియా క్రీడల్లో పతకాల సాధనలో భారత్ వెనకబాటే అందుకు నిదర్శనం.
తీవ్ర విభేదాలు
దేశీయంగా క్రీడా సమాఖ్యలన్నింటినీ నడిపిస్తూ, ఒలింపిక్ క్రీడలకు అథ్లెట్లను సన్నద్ధం చేయడంలో భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కీలక పాత్ర పోషిస్తుంది. ఆ సంఘం సైతం అంతర్గత కలహాలతో అట్టుడుకుతోంది. ఐఓఏ అధ్యక్షుడు నరిందర్ బత్రా, ఉపాధ్యక్షుడు సుధాంశు మిత్తల్ మధ్య చాలా రోజులుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఫలితంగా ఐఓఏ రెండుగా చీలిపోయి క్రీడా సమాఖ్యల వివాదాల్లో కోర్టులో వేర్వేరు వర్గాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇండియాలో వివాదాలకు దూరంగా ఉన్న క్రీడా సమాఖ్యలను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. ప్రతిష్ఠాత్మక క్రీడలు సమీపిస్తున్న తరుణంలోనూ పలు క్రీడా సమాఖ్యలు వివాదాలతో ఈసురోమంటున్నాయి. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకాలు తెచ్చిపెట్టే అవకాశం ఉన్న టేబుల్ టెన్నిస్(టీటీ)లో కొన్ని నెలలుగా వివాదం కొనసాగుతోంది. దాంతో క్రీడాకారులు కీలకమైన సన్నాహక టోర్నీలు ఆడలేని పరిస్థితి ఏర్పడింది. తన శిష్యురాలికి ఒలింపిక్ బెర్తు దక్కేలా చేసేందుకు మ్యాచ్ ఓడిపోవాలని తనపై ఒత్తిడి తెచ్చాడంటూ కోచ్ సౌమ్యదీప్ రాయ్‌పై స్టార్ క్రీడాకారిణి మనిక బత్రా సంచలన ఆరోపణలు చేశారు. ఆ తరవాత తనను ఉద్దేశపూర్వకంగా ఆసియా ఛాంపియన్‌షిప్‌నకు దూరం పెట్టారని ఆరోపిస్తూ ఆమె కోర్టును ఆశ్రయించారు. ఆ వివాదంపై న్యాయస్థానం విచారణ కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సు మేరకు కోర్టు భారత టీటీ సమాఖ్య (టీటీఎఫ్‌ఐ)ను సస్పెండ్ చేసింది. ఫలితంగా మార్చిలో జరిగే వివిధ అంతర్జాతీయ టోర్నీలకు భారత క్రీడాకారులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అథ్లెట్ల ఎంట్రీలను అంతర్జాతీయ టీటీ సమాఖ్య (ఐటీటీఎఫ్)కు పంపాల్సిన టీటీఎఫ్‌ఐ సస్పెన్షన్‌లో ఉండటంతో అథ్లెట్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. స్టార్ క్రీడాకారుడు శరత్ కమల్ కేంద్ర క్రీడల మంత్రిని కలిసినా, సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు. మరోవైపు ఒలింపిక్ క్రీడ ఈక్వెస్ట్రియన్ విషయంలోనూ వివాదం నెలకొంది. గతేడాది భారత క్రీడాకారులు కొందరు నేపాలీల మాదిరిగా వేషం వేసుకొని ఆ దేశం తరఫున ఒక అంతర్జాతీయ టోర్నీలో పోటీ పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ వ్యవహారం కోర్టుకు చేరి, భారత ఈక్వెస్ట్రియన్ సంఘంపై వేటు పడే పరిస్థితి తలెత్తింది. దాంతో ఆ క్రీడలో భారత్ నుంచి ఆసియా క్రీడల్లో ప్రాతినిధ్యమే సందేహంగా మారింది.
చేజారిన పతకాలు
సమాఖ్యల్లో రాజకీయాలు, క్రీడాకారులు, అథ్లెట్లు, కోచ్‌ల మధ్య గొడవల కారణంగా ఒలింపిక్ పతకాలు చేజారిన సందర్భాలూ ఉన్నాయి. నిరుడు టోక్యోలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన షూటర్ మను బాకర్ పేలవ ప్రదర్శనకు కోచ్ జస్పాల్ రాణాతో గొడవే కారణమన్న కథనాలు వెలువడ్డాయి. అతడితో ఇతర క్రీడాకారులకూ ఇబ్బందులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. 2016 ఒలింపిక్స్‌కు ముందు రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్‌ల మధ్య పెద్ద వివాదమే నడిచింది. సుశీల్ పతకం గెలుస్తాడన్న అంచనాలున్నా, నిబంధనల ప్రకారం నర్సింగ్ రియోకు వెళ్లారు. ఆయన అనుమానాస్పద రీతిలో డోపీగా తేలి ఒలింపిక్స్‌కు దూరమయ్యారు. తనను కుట్రపూరితంగా ఇరికించారంటూ నర్సింగ్ కోర్టుకెక్కారు. ఆ విభాగంలో ఇద్దరు స్టార్ రెజ్లర్లూ పోటీకి దూరమవడంతో భారత్‌కు పతకం అవకాశం చేజారింది. టెన్నిస్ సంఘంలో రాజకీయాలు, క్రీడాకారుల మధ్య సఖ్యత లేకపోవడంవల్ల 2012, 2016 ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచే అవకాశాలు నీరుగారిపోయాయన్న విశ్లేషణలు సైతం బాధించేవే. ఇలాంటి అనుభవాల నుంచి క్రీడాకారులు, సమాఖ్యలు పాఠాలు నేర్వకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అసలే కరోనా కారణంగా క్రీడాకారుల సన్నాహాలు బాగా దెబ్బతిన్నాయి. దానికితోడు అనవసర వివాదాలు, రాజకీయాలు క్రీడా స్ఫూర్తికి మరింత ప్రతిబంధకంగా మారుతున్నాయి. ఇండియా విశ్వ క్రీడాశక్తిగా ఎదగాలంటే ఇటువంటి వాటికి తప్పకుండా అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఉంది.
ఇదీ చూడండి: IND VS SL: లంకతో సమరానికి టీమ్ఇండియా సై