దిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన హత్య కేసులో భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ ఘటనలో సాగర్ అనే మల్లయోధుడు మరణించగా.. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. గాయపడిన సోనూ మహల్ అనే వ్యక్తి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు.
సుశీల్‌తో పాటు మరికొందరు అతని సన్నిహితులు తమపై దాడి చేశారని ఆ వ్యక్తి తెలిపాడు. మరో నిందుతుడు ప్రిన్స్ చరవాణి నుంచి గొడవకు సంబంధించి ఓ వీడియోను తీసుకున్నారు. దాడిలో పాల్గొన్న వారి ముఖాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
అసలేం జరిగింది?
ఛత్రసాల్ స్టేడియంలో మంగళవారం రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. ఇందులో మల్లయోధులు సాగర్, సోను, అమిత్‌ల బృందంపై.. సుశీల్ కుమార్, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఇందులో సాగర్ మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. సంఘటన స్థలంలో కొన్ని వాహనాలతో పాటు ఓ గన్ లభ్యమయ్యాయి. ఇందుకు సంబంధించి మోడల్ టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.
బాధితుడి వాంగ్మూలం ప్రకారం సుశీల్ ప్రమేయం కూడా ఈ హత్య కేసులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అతని కోసం గాలిస్తున్నారు. స్టేడియంలోని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి: ఆర్చరీ ప్రపంచకప్‌కు భారత్ దూరం!