భారత్‌లో కరోనా దెబ్బకు చిన్న క్రీడా టోర్నీలతో పాటు ప్రధాన టోర్నీలూ వాయిదా పడుతున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగింది షూటింగ్ ప్రపంచకప్. దిల్లీ వేదికగా ఈనెల 15 నుంచి 25 వరకు ఈ టోర్నీ జరగాల్సి ఉంది. కాగా కరోనా వైరస్ విజృంభణతో ఈ టోర్నీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు నిర్వాహకులు. అలాగే ఏప్రిల్ 16 నుంచి ప్రారంభంకావాల్సి ఉన్న ఒలింపిక్ టెస్టు ఈవెంట్ రద్దయింది.
రెండు భాగాలుగా షూటింగ్ ప్రపంచకప్
వాయిదా పడిన షూటింగ్ ప్రపంచకప్‌ను రెండు భాగాలుగా నిర్వహించనున్నారు. మే 5-12 మధ్య రైఫిల్, పిస్టోల్ కాంపిటేషన్, జూన్ 2-9 మధ్య షాట్‌గన్ పోటీలను జరపనున్నారు. దీనివల్ల ఒలింపిక్స్ కంటే ముందే పోటీలు పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
యథావిధిగా ఐపీఎల్
ఈ వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. దీనిపై ఇప్పటికే స్పష్టతనిచ్చాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. ఐపీఎల్ ప్రణాళిక ప్రకారం ఈనెల 29న ప్రారంభమవుతుందని తెలిపాడు.
శాయ్ కొత్త నిర్ణయం
కరోనా బారినపడకుండా ఉండేందుకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (శాయ్) ఓ నిర్ణయం తీసుకుంది. క్రీడాకారులతో పాటు సిబ్బందికి బయోమెట్రిక్ హాజరును తొలిగించింది. అన్ని సెంటర్లకు ఇది వర్తిస్తుందని తెలిపింది.
భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు 31 మంది ఈ వైరస్ బారినపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 3,300 కేసులు నమోదయ్యాయి.