ETV Bharat / sports

అదరగొట్టిన వెయిట్​లిఫ్టర్లు.. కామన్​వెల్త్​ గేమ్స్​లో భారత్​కు 4 పతకాలు - bindyarani devi won silver medal

టోక్యోలో అంచనాల్ని మించిన ప్రదర్శనతో రజతం గెలిచి అబ్బుర పరిచిన అమ్మాయి మీరాబాయి చాను. ఆ దూకుడు చూశాక కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణానికి తక్కువగా ఏ పతకం సాధించినా ఆమె స్థాయికి తగని ప్రదర్శనే అవుతుందంటూ భారీ అంచనాలే పెట్టుకున్నారు అభిమానులు. ఈ అంచనాల ఒత్తిడి మీరాను ఎంతమాత్రం తొణకనివ్వలేదు. క్రీడల రికార్డును బద్దలు కొడుతూ పసిడి పట్టేసింది మన మీరా. రెండో స్థానంలో నిలిచిన క్రీడాకారిణికి, మీరాకు మధ్య బరువు అంతరం 29 కిలోలు అంటే ఆమె ఎంత గొప్ప ప్రదర్శన చేసిందో అర్థం చేసుకోవచ్చు. మీరా కంటే ముందు ఇద్దరు, ఆ తర్వాత ఒకరు వెయిట్‌లిఫ్టర్లు భారత్‌కు పతకాలు సాధించి పెట్టారు. సంకేత్‌ రజతంతో భారత్‌ పతక ఖాతా తెరవగా.. గురురాజ కాంస్యం, బింద్యారాణి దేవి రజతం సాధించారు.

commonwealth games 2022 India won four medals in weightlifting
అదరగొట్టిన వెయిట్​లిఫ్టర్లు.. కామన్​వెల్త్​ గేమ్స్​లో నాలుగుకు చేరిన పతకాలు
author img

By

Published : Jul 31, 2022, 7:13 AM IST

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత పతక ప్రయాణం మొదలైంది. శనివారం వెయిట్‌లిఫ్టర్ల అద్భుత ప్రదర్శనతో ఒక్కరోజే మూడు పతకాలు వచ్చాయి. ఈ క్రీడల్లో దేశానికి పతకాలు అందించడంలో ముందుండే వెయిట్‌లిఫ్టర్లు ఈ సారీ ఆనవాయితీ కొనసాగించారు. మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణం, పురుషుల 55 కేజీల్లో సంకేత్‌ రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ పూజారి కాంస్యం, మహిళల 55 కేజీల విభాగంలో బింద్యారాణి రజతం నెగ్గారు. ఫేవరేట్‌గా బరిలో దిగిన చాను 201 కేజీల (88+113) ప్రదర్శనతో కామన్వెల్త్‌ క్రీడల రికార్డు నెలకొల్పి పసిడి పట్టేసింది. ప్రత్యర్థులెవరూ ఆమె దరిదాపుల్లోకి కూడా రాలేదు. రెండో స్థానంలో నిలిచిన లిఫ్టర్‌కు ఆమె ప్రదర్శనకు మధ్య 29 కేజీల అంతరం ఉంది. చాను స్నాచ్‌లో తొలి ప్రయత్నంలోనే 84 కేజీలెత్తి మెరుగ్గా పోరు ఆరంభించింది.

ఆ తర్వాత 88 కేజీల ప్రదర్శన చేసి అగ్రస్థానంలో నిలిచింది. మూడో ప్రయత్నంలో 90 కేజీలు ఎత్తేందుకు విఫలమైంది. ఇక క్లీన్‌ అండ్‌ జర్క్‌లో తొలి ప్రయత్నంలోనే 109 కేజీల ప్రదర్శనతో బంగారు పతకం ఖాయం చేసుకుంది. రెండో ప్రయత్నంలో 113 కేజీల బరువెత్తి రికార్డు నెలకొల్పింది. చివరి ప్రయత్నంలో 115 కేజీలు ఎత్తలేకపోయింది. అయినా ఏ ఇబ్బంది లేకుండా పోయింది. అప్పటికే బంగారు పతకం తన మెడలో వాలేందుకు సిద్ధమైంది. హనిత్ర (172 కేజీలు, మారిషస్‌), కమిన్‌స్కి (171 కేజీలు, కెనడా) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. అంతకుముందు సంకేత్‌ వెండి పతకంతో భారత్‌ ఖాతా తెరిచాడు. పసిడి సాధించేలా కనిపించిన అతణ్ని గాయం దెబ్బతీసింది.

కేవలం ఒక్క కిలో తేడాతో స్వర్ణం చేజార్చుకున్నాడు. మొత్తం 248 కేజీల ప్రదర్శనతో ఈ 21 ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు రెండో స్థానానికి పరిమితమయ్యాడు. స్నాచ్‌లో మూడో ప్రయత్నంలో 113 కేజీల (తొలి రెండు ప్రయత్నాల్లో వరుసగా 107, 111 కేజీలు) బరువెత్తి ఆ విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. క్లీన్‌ అండ్‌ జర్క్‌లోనూ అదే దూకుడు కొనసాగించాడు. తొలి ప్రయత్నంలోనే 135 కేజీల ప్రదర్శనతో మొదటి స్థానానికి దూసుకెళ్లాడు. కానీ రెండో ప్రయత్నంలో (139 కేజీలు) ఆ బరువును ఛాతీ వరకు ఎత్తుకుని క్లీన్‌ పూర్తి చేసిన అతనికి.. దాన్ని తల మీదకు తీసుకు వచ్చే క్రమంలో కుడి మోచేతికి గాయమైంది. గాయం బాధిస్తున్నా మూడో ప్రయత్నం చేసి మరోసారి విఫలమయ్యాడు. అప్పటికీ అతనే అగ్రస్థానంలో ఉన్నాడు.

కానీ ఆ తర్వాత మహమ్మద్‌ అనిక్‌ (మలేసియా) 142 కేజీల బరువెత్తి పసిడి పట్టుకుపోయాడు. స్నాచ్‌లో 107 కేజీలు ఎత్తిన అతను.. మొత్తం 249 కేజీల ప్రదర్శనతో కామన్వెల్త్‌ క్రీడల రికార్డు నమోదు చేశాడు. దిలంక (225 కేజీలు, శ్రీలంక) కాంస్యం గెలిచాడు. తర్వాత పురుషుల 61 కేజీల విభాగంలో గురురాజ కాంస్యం నెగ్గాడు. 269 (118+151) కేజీల ప్రదర్శనతో అతను మూడో స్థానంలో నిలిచాడు. అజ్నిల్‌ (285 కేజీలు, మలేసియా) కామన్వెల్త్‌ రికార్డుతో పసిడిని నిలబెట్టుకున్నాడు. మోరియా (273 కేజీలు, పపువా న్యూగినియా) రజతం నెగ్గాడు. స్నాచ్‌లో వరుసగా 115 కేజీలు, 118 కేజీలు ఎత్తిన గురురాజ.. మూడో ప్రయత్నంలో విఫలమయ్యాడు. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో అతను మూడో ప్రయత్నంలో 151 కేజీలు ఎత్తి పతకం ఖాయం చేశాడు. 2018 క్రీడల్లో గురురాజ 56 కేజీల విభాగంలో రజతం నెగ్గాడు.

.
మీరాబాయి చాను

ఆమె సరికొత్తగా: టోక్యో ఒలింపిక్స్‌లో రజతం.. ఆ ఘనత సాధించిన తొలి భారత వెయిట్‌లిఫ్టర్‌గా చరిత్ర.. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 119 కేజీల ప్రదర్శనతో ప్రపంచ రికార్డు.. ఇలా తనదైన శైలిలో దూసుకుపోతున్న మీరాబాయి చాను తన ప్రయాణాన్ని ఎప్పటికప్పుడూ సరికొత్తగా మార్చుకుంటోంది. అలసటను దరి చేరనీయలేదు. ఏకాగ్రతను దూరం చేసుకోలేదు. తన టెక్నిక్‌ను మరింత పటిష్ఠంగా మార్చుకోవాలనే ధ్యేయంతో సాగింది. శిక్షణను ఇంకా కఠిన తరం చేసింది. స్నాచ్‌లో కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని అందుకునే దిశగా కష్టపడుతోంది. విదేశాల్లో ఉత్తమ వసతుల మధ్య అత్యుత్తమంగా ప్రాక్టీస్‌ కొనసాగించింది.

కామన్వెల్త్‌ క్రీడల్లో ఎక్కువ పతకాలు రావాలనే ఉద్దేశంతో భారత వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్‌ఎఫ్‌) చానును 55 కేజీల విభాగానికి మారాలని సూచించింది. తన బరువు పెంచుకుని.. ఆ విభాగానికి తగినట్లుగా ఆమె సిద్ధమైంది. అందుకోసం ఎంతగానో శ్రమించింది. కానీ ఒక్క విభాగం నుంచి అత్యుత్తమ వెయిట్‌లిఫ్టర్‌ మాత్రమే క్రీడలకు ఎంపికవుతారనే నిబంధన కారణంగా చాను తిరిగి 49 కేజీల్లోనే పోటీపడింది. ఇప్పటికే క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 119 కేజీల ప్రదర్శనతో ప్రపంచ రికార్డు సృష్టించిన ఆమె.. స్నాచ్‌లో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన చేయడం లేదనే చెప్పాలి. ఈ కామన్వెల్త్‌ క్రీడల స్నాచ్‌లో 90 కేజీలు అందుకోవాలనే లక్ష్యంతో బరిలో దిగింది. అందులో విఫలమైనప్పటికీ 88 కేజీలెత్తి తన వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనతో సరికొత్త కామన్వెల్త్‌ క్రీడల రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత క్లీన్‌ అండ్‌ జర్క్‌లోనూ దూకుడు కొనసాగించి రికార్డుతో పతకం పట్టేసింది. 2014 గ్లాస్కో క్రీడల్లో రజతం, 2018 గోల్డ్‌కోస్ట్‌ క్రీడల్లో స్వర్ణం నెగ్గిన ఆమె.. ఇప్పుడు మరో పసిడి ఖాతాలో వేసుకుంది. ఇక ఇదే జోరులో స్నాచ్‌లో ప్రదర్శన మెరుగుపర్చుకుని.. వచ్చే ఒలింపిక్స్‌లో పతకం రంగు మారుస్తుందేమో చూద్దాం.

gururaja
గురురాజ

మెరుగైన జీవితం కోసం..: కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని ఓ చిన్న గ్రామం. అందులో ట్రక్‌ డ్రైవర్‌గా పని చేసే ఓ వ్యక్తి కుటుంబం. అతనికి ఆరుగురు కొడుకులు. అసలే పేదరికం. ఆ ఆరుగురిలో ఒకడైన ఆ కుర్రాడికి తమ ఆర్థిక పరిస్థితి మార్చాలనే తపన మొదలైంది. అందుకు ఆటలే మార్గమని నమ్మాడు. ఇప్పుడా ఆ ఆటలో గొప్పగా రాణిస్తున్నాడు. అతనే గురురాజ పూజారి. 2008 ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌లో సుశీల్‌ కుమార్‌ కాంస్యం నెగ్గడం చూసిన అతను.. మొదట రెజ్లర్‌ కావాలనుకున్నాడు. కానీ తన కళాశాలలో కోచ్‌ సలహాతో వెయిట్‌లిఫ్టింగ్‌ వైపు సాగాడు.

కఠిన పరిస్థితుల్లోనూ ఆటను వదల్లేదు. టోర్నీల్లో గెలిస్తే వచ్చే నగదు బహుమతితోనే తన శిక్షణ కొనసాగించాడు. 156 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న అతనికి ఆర్మీలో ఉద్యోగం రాలేదు. చివరకు వాయుసేనలో చేరాడు. 2016లో కామన్వెల్త్‌ ఛాంపియన్‌షిప్‌లో పసిడితో మెరిశాడు. 2018 కామన్వెల్త్‌ క్రీడల్లో 56 కేజీల విభాగంలో రజతం నెగ్గాడు. ఇప్పుడు జ్వరంతో పాటు మోకాలు, మణికట్టు నొప్పితో పూర్తిస్థాయిలో సాధన చేయలేకపోయినా కాంస్యంతో సత్తాచాటాడు.

రైతు బిడ్డ..: వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో మహిళల 55 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి బింద్యారాణి దేవి రజతం సాధించింది. మొత్తం 202 కిలోలను ఎత్తి రికార్డును సృష్టించింది దేవి. 203 కేజీలతో నైజీరియాకు చెందిన ఆదిజత్ అడెనికే ఒలారినోయే స్వర్ణ పతకాన్ని అందుకుంది. ఈ సందర్భంగా బింద్యారాణి దేవి తన అనుభవాలను పంచుకున్నారు.' ఇది నా మొదటి కామన్​వెల్త్​ గేమ్స్​. రజతం సాధించడం పట్ల నేను సంతోషంగా ఉన్నాను' అని బింద్యారాణి చెప్పారు. చానులాగే బింద్యారాణి కూడా మణిపూర్‌ నుంచే వచ్చింది. కిరాణా దుకాణం నడుపుతున్న రైతు బిడ్డ బింద్యారాణి.

BINDYARANI
బింద్యారాణి

క్వార్టర్స్‌లో బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ జట్టు: కామన్వెల్త్‌ క్రీడల్లో బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో భారత్‌ నాకౌట్‌కు దూసుకెళ్లింది. లీగ్‌ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన మన బృందం.. రెండో మ్యాచ్‌లో శ్రీలంకను 5-0తో ఓడించి గ్రూప్‌-ఏలో అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి మ్యాచ్‌లో ప్రయోగాత్మకంగా అశ్విని పొన్నప్ప-సాత్విక్‌లను భారత్‌ జోడీగా బరిలో దింపింది. ఈ జోడీ 21-14, 21-9తో సచిన్‌-తిలిని జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ 21-18, 21-5తో నిలుక కరుణరత్నేను చిత్తు చేయగా.. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్‌ 21-3, 21-9తో విదారను ఓడించింది. పురుషుల డబుల్స్‌లో సుమీత్‌రెడ్డి-చిరాగ్‌శెట్టి 21-10, 21-13తో దుమిందు-సచిన్‌లను ఓడించగా.. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌-ట్రెసా జాలీ 21-18, 21-6తో విదార విదనాగె-తిలినిపై నెగ్గారు.

ప్రిక్వార్టర్స్‌లో హుసాముద్దీన్‌: 2018 కామన్వెల్త్‌ క్రీడల కాంస్య పతక విజేత మహ్మద్‌ హుసాముద్దీన్‌ శుభారంభం చేశాడు. పురుషుల 57 కేజీల విభాగం తొలి రౌండ్లో ఈ తెలంగాణ బాక్సర్‌ 5-0తో అమ్‌జోలెలె (దక్షిణాఫ్రికా)ను చిత్తు చేశాడు. మహిళల విభాగంలో ఒలింపిక్‌ కాంస్య పతక విజేత లవ్లీనా క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. 70 కిలోల విభాగంలో అరియాన (న్యూజిలాండ్‌)ను చిత్తు చేసింది. మహిళల హాకీలో భారత జట్టు రెండో విజయం సాధించింది. శనివారం 3-1తో వేల్స్‌ను ఓడించింది.

sanketh
సంకేత్‌

ఫైనల్‌కు నటరాజ్‌: స్విమ్మింగ్‌లో శ్రీహరి నటరాజ్‌ సత్తా చాటాడు. పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ సెమీఫైనల్లో 54.44 సెకన్లలో లక్ష్యాన్ని చేరిన శ్రీహరి నాలుగో స్థానంతో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. తుది సమరంలో సత్తా చాటితే స్విమ్మింగ్‌లో పతకం గెలిచిన రెండో భారత ఆటగాడిగా అతడు ఘనత సాధిస్తాడు. 2010 దిల్లీ కామన్వెల్త్‌ క్రీడల్లో పారా స్విమ్మింగ్‌లో ప్రశాంత కర్మాకర్‌ కాంస్యం సాధించాడు. పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టైల్‌, 400 మీటర్ల ఫ్రీస్టైల్‌ పోటీల్లో కుశాగ్ర రావత్‌ సెమీస్‌ చేరలేకపోయాడు. పురుషుల 50 మీటర్ల బటర్‌ఫ్లైలో సాజన్‌ ప్రకాశ్‌ (25.01 సె) ఎనిమిదో స్థానంలో నిలిచాడు. స్క్వాష్‌లో జోష్న చిన్నప్ప, సౌరవ్‌ ఘోషల్‌ ప్రిక్వార్టర్స్‌ చేరారు. మహిళల సింగిల్స్‌లో జోష్న 11-8, 11-9, 12-10తో మెగాన్‌ బెస్ట్‌ (బార్బడోస్‌)ను ఓడించగా.. పురుషుల సింగిల్స్‌లో సౌరవ్‌ ఘోషల్‌ 11-4, 11-4, 11-6తో షమిల్‌ (శ్రీలంక)ను ఓడించాడు.

టీటీ అమ్మాయిల ఓటమి: మహిళల టీమ్‌ విభాగంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ క్వార్టర్‌ఫైనల్లో 2-3తో మలేసియా చేతిలో పోరాడి ఓడింది. డబుల్స్‌లో ఆకుల శ్రీజ-రీత్‌ 1-3తో కరెన్‌-అలైస్‌ చేతిలో ఓడగా.. సింగిల్స్‌లో మనిక బాత్రా 3-2తో యింగ్‌ హోపై గెలిచి స్కోరు సమం చేసింది. ఆ తర్వాత సింగిల్స్‌లో ఆకుల శ్రీజ 3-0తో అలైస్‌ చాంగ్‌కు షాక్‌ ఇవ్వడంతో భారత్‌ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ మనిక 0-3తో కరైన్‌ చేతిలో కంగుతినడంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. చివరి పోరులో రీత్‌ 2-3తో యింగ్‌ హో చేతిలో పోరాడి ఓడింది. టీటీ పురుషుల టీమ్‌ విభాగం గ్రూప్‌ మ్యాచ్‌లో భారత్‌ 3-0తో నార్త్రన్‌ ఐర్లాండ్‌పై గెలిచింది. జిమ్నాస్టిక్స్‌లో యోగేశ్వర్‌ ఆల్‌రౌండ్‌ ఫైనల్‌కు అర్హత సాధించాడు.

ఇదీ చదవండి: Commonwealth games: మీరాబాయి సరికొత్త చరిత్ర.. కామన్వెల్త్​లో స్వర్ణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.