కరోనా మహమ్మారి నేపథ్యంలో బయటకు వెళ్లి సాధన చేసే వీల్లేదు. ఇంట్లోనే కసరత్తులు కొనసాగిస్తున్నా. జాతీయ శిక్షణ శిబిరంలో ఉంటే భాగస్వామితో కలిసి మ్యాచ్ ప్రాక్టీస్ చేసే వీలుండేది. కానీ ఇప్పుడు ఒక్కడినే సాధన చేసుకోవాల్సి వస్తోంది. ఫిట్‌నెస్ కాపాడుకోవడమే కాకుండా బరువును స్థిరంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నా. ఆటలో బలహీనతలను అధిగమించడంపై దృష్టి సారించా. టోర్నీలు నిర్వహిస్తే పాల్గొందామని అనుకుంటున్నా కానీ ఇప్పట్లో అది సాధ్యం కాకపోవచ్ఛు. ఫిట్‌గా ఉండాలంటే కావాల్సింది ప్రాక్టీసే. ఆహారం విషయంలో పెద్దగా పరిమితులు విధించుకోను. నేనేం తిన్నా కూడా ప్రాక్టీస్ విషయంలో తీవ్రంగా కష్టపడతా. నాకు వంట చేయడం ఎప్పటి నుంచో తెలుసు. ఈ లాక్‌డౌన్‌లో కొత్తగా పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నా.
పసిడి కోసమే..:
టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడడం నా వరకు సానుకూలాంశం. ఆ క్రీడల కోసం మూడేళ్ల నుంచే సిద్ధమవుతున్నా. నా సన్నాహకం కోసం మరో ఏడాది అదనంగా లభించింది. దేశం కోసం స్వర్ణం నెగ్గడం లక్ష్యంగా పెట్టుకున్నా. అత్యుత్తమ ప్రదర్శనతో దాన్ని అందుకుని, దేశ ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసేందుకు ప్రయత్నిస్తా. వ్యక్తిగత విభాగంలో భారత్ నుంచి స్వర్ణం నెగ్గిన ఏకైక అథ్లెట్‌గా ఉన్న అభినవ్ బింద్రా సరసన చేరేందుకు కృషి చేస్తా. ఈ కరోనా ఎప్పుడు అంతమవుతుందో చెప్పలేం. వచ్చే ఏడాదికి వాయిదా పడ్డ ఒలింపిక్స్ రద్దవుతాయని అనుకోవట్లేదు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ప్రదర్శన బట్టి ఈ సారి ఒలింపిక్స్‌లో మన రెజ్లర్లు మూడు లేదా నాలుగు పతకాలు గెలిచే అవకాశముంది.
ఆ విజయం..:
2013 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం గెలవడమే నా కెరీర్‌లో ఉత్తమ ప్రదర్శన. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ల్లో అదే నా తొలి పతకం. అదెప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. అప్పుడు నా వయసు 19 ఏళ్లు. ఆ తర్వాత రజతం (2018), కాంస్యం (2019) నెగ్గాను. 2015 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మ్యాచ్ ఓడిపోయినపుడు తీవ్ర నిరాశ చెందా. మరో 12 సెకన్లలో పోరు ముగుస్తుందనగా ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. తడబడి పరాజయం చెందడం బాధ కలిగించింది.
వాటి గురించి ఆలోచించను..:
రెజ్లింగ్ చేయడమే నా పని. అవార్డులు, పురస్కారాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించడమే నా ధ్యేయం. అత్యుత్తమ ప్రదర్శన చేసినవాళ్లను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత.