ఆసియా మిక్స్‌డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ పోరాటం ఫలించలేదు. డబుల్స్ జోడీ పోరాడినా మన బృందానిది ఓటమి పక్షమే. శనివారం హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారత్ 2-3తో చైనా చేతిలో ఓడింది. ఈ మ్యాచ్‌లో మొదట పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ 13-21, 15-21తో లీ లాన్ చేతిలో ఓడడంతో భారత్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ తర్వాత మరో షాక్. టాప్ షట్లర్ పి.వి.సింధు 9-21, 21-16, 18-21తో ప్రపంచ 101వ ర్యాంకర్ ఫాంగ్ గావో చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. తొలి రెండు మ్యాచ్‌లు పోవడంతో ఇక కథ ముగిసినట్లే అనిపించింది.
పురుషుల డబుల్స్‌లో ధ్రువ్ కపిల-చిరాగ్ శెట్టి 21-19, 21-19తో హిజి తింగ్-హో డాంగ్‌ను ఓడించి ఆశలు నిలిపింది. ఆ తర్వాత తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగిన మహిళల జోడీ పుల్లెల గాయత్రి-ట్రెసా జాలీ అద్భుత ప్రదర్శన చేసింది. లీషెంగ్-వీజిన్‌తో మూడు గేమ్‌ల పాటు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో 21-18, 13-21, 21-19తో విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థి జోడీ మెరుపు షాట్లకు దీటుగా సమాధానం చెప్పిన భారత జంట ఏ దశలోనూ తగ్గలేదు. ముఖ్యంగా ఆఖరి గేమ్‌లో పోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. సుదీర్ఘ ర్యాలీలతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో 19-19తో స్కోరు సమమైనప్పుడు వరుసగా రెండు పాయింట్లు గెలిచిన భారత జంట సంచలన విజయాన్ని సాధించింది.
భారత్ 2.. చైనా 2 మ్యాచ్‌లు నెగ్గడంతో అందరి దృష్టి ఇషాన్ భట్నాగర్-తనీషా మిక్స్‌డ్ డబుల్స్‌పైనే నిలిచింది. జియాంగ్-వీయ్‌యాతో మ్యాచ్‌లో పోరాడినా 17-21, 13-21తో ఇషాన్ జంటకు ఓటమి తప్పలేదు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన జియాంగ్ ద్వయం భారత జంటకు అవకాశం ఇవ్వకుండా ఆడి చైనాను ఫైనల్‌కు తీసుకెళ్లింది. మరో సెమీస్‌లో కొరియా 3-1తో థాయ్‌లాండ్‌ను ఓడించింది.