విలువైన ఐపీఎల్ కాంట్రాక్ట్‌లు దక్కించుకోవడం కోసం ఆస్ట్రేలియా క్రికెటర్లు కోహ్లీతో మంచిగా ఉండడానికి ప్రయత్నించారని, అతణ్ని స్లెడ్జింగ్ చేయలేదని ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ చేసిన ఆరోపణలను ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ పైన్ తిరస్కరించాడు. 'జట్టులో ఎవరూ కోహ్లీతో చాలా మంచిగా ఉండడం గానీ, అతడ్ని ఔట్ చేయడానికి ప్రయత్నించకుండా ఉండటం గానీ నేను చూడలేదని' పైన్ అన్నాడు.
'ఎవరు కోహ్లీ పట్ల సరళంగా ఉన్నారో నాకు తెలియదు. కోహ్లీతో గొడవకు దిగి అతడ్ని రెచ్చగొట్టకూడదన్నది మా వ్యూహం. రెచ్చిగొట్టినప్పుడు అతడు తన అత్యుత్తమ క్రికెట్ ఆడతాడన్నది మా ఉద్దేశమని' పైన్ చెప్పాడు.
భారత్.. అక్టోబరులో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సివుంది. అందులో భాగంగా నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడునుంది. 'ఐపీఎల్‌తో నాకైతే పెద్దగా ప్రయోజనాలేమీ లేవు. నేను కోల్పోయేదేమీ లేదు. కానీ ఎప్పుడు ఆస్ట్రేలియా తరఫున టెస్టు మ్యాచ్ ఆడినా మా ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తారు. కోహ్లీకి బౌలింగ్ చేసేటప్పుడు మా బౌలర్లు ఐపీఎల్ కాంట్రాక్టుల గురించి ఆలోచిస్తారని నేను అనుకోను' అని పైన్ అన్నాడు.
ఇదీ చూడండి: పీటర్సన్‌కు యువీ కౌంటర్.. అదిరిపోలా!