Leo Messi World Cup : లియొనెల్ మెస్సీ.. ఈ సాకర్ మాంత్రికుడి ఉజ్వల కెరీర్‌కు అద్భుతమైన ముగింపునిస్తూ.. ప్రపంచకప్ వచ్చి అతడి ఒళ్లో వాలింది. తన అత్యుత్తమ ఆటనంతా ఈ కప్పు కోసమే దాచుకున్నాడా అన్నట్లు.. అతను చూపించిన వేగం, సహచరులతో అతడి సమన్వయం, ప్రత్యర్థి డిఫెన్స్ గోడల్ని అతను బద్దలు కొట్టిన వైనం ఒక చరిత్ర! ఒక మేటి ఫుట్‌బాలర్ తన అత్యుత్తమ ఆటను బయటికి తీస్తే ఎలా ఉంటుందో ఈ నెల రోజుల్లో ఫుట్‌బాల్ ప్రపంచమంతా చూసి ఫిదా అయిపోయింది. మంత్రముగ్ధమైన అతడి ఆటకు.. ప్రపంచకప్ దిగి వచ్చి సలాం కొట్టక తప్పలేదు!
ఆట ఏదైనా సరే, అందులో అత్యుత్తమ స్థాయిని అందుకున్న ఆటగాడు.. ఆ ఆటలో అత్యున్నత ఘనతను సొంతం చేసుకోవాలని కోరుకుంటాం! వన్డే ప్రపంచకప్ కోసం సచిన్ సుదీర్ఘ నిరీక్షణ కొనసాగుతున్న వేళ.. 2011లో అతను దాన్ని అందుకుని నిష్క్రమించాలని మెజారిటీ క్రికెట్ ప్రపంచం కోరుకుంది! ఇప్పుడు ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో అర్జెంటీనా టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచిన వేళ.. ఒక్క ఫ్రాన్స్ అభిమానులు తప్ప అందరూ మెస్సీ జట్టుకే కప్పు సొంతం కావాలని కోరుకున్నారు! మెస్సిపై అభిమానం అలాంటిది మరి! ఫుట్‌బాల్ అందాన్ని, సొగసును ద్విగుణీకృతం చేసేలా ఆడే అరుదైన ఆటగాళ్లలో మెస్సి ఒకడు. అతడి పాద కదలికలు, డ్రిబ్లింగ్ నైపుణ్యం, గోల్స్ కొట్టడంలో నేర్పరితనం చూసి.. ముందు తరం దిగ్గజాలు సైతం అబ్బురపడ్డారు.
ఫుట్‌బాల్‌తో పెద్దగా పరిచయం లేని వాళ్లు కూడా కాసేపు తన ఆట చూస్తే ఈ ఆటలో మజా ఏంటో అర్థమై ఆస్వాదించేలా చేయగల ఆకర్షణ మెస్సి సొంతం. రెండు దశాబ్దాలుగా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో, క్లబ్ ఫుట్‌బాల్‌లో తన మంత్రముగ్ధమైన ఆటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు లియొనెల్ అందించిన వినోదం అపరిమితం! అందుకే అతడి ఘనతల సరసన ప్రపంచకప్ విజయం కూడా చేరాలని ఎప్పట్నుంచో అభిమానులు కోరుకుంటున్నారు. 2014లో ఆ కలకు అత్యంత చేరువగా వచ్చి త్రుటిలో కప్పును కోల్పోయాడు. కానీ 2022 నాటికి వయసు పెరిగినా ఉత్సాహం, చురుకుదనం తగ్గని మెస్సి.. తన పతాక స్థాయి ఆటతో జట్టును గెలిపించాడు.
ఈ ఒక్క విజయంతో..
పీలే.. మారడోనా.. ఫుట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లుగా పేరున్న దిగ్గజాలు. నైపుణ్యాల్లో, ఘనతల్లో ఒకరికొకరు దీటుగా నిలుస్తారు. వీరి తర్వాత ఆ స్థాయి ఆటగాళ్లు ఎవరంటే గుర్తుకొచ్చే పేర్లు లియొనెల్ మెస్సి, క్రిస్టియానో రొనాల్డోలవే. క్లబ్ ఫుట్‌బాల్‌లో వీరు సాధించిన ఘనతలు అసాధారణం. ఇక నైపుణ్యం విషయంలో ఎవరికి వారే సాటి. వీరిలో ఎవరు గొప్ప అంటే చెప్పడం కష్టమే! కానీ ఇప్పుడు ప్రపంచకప్ విజయంతో మెస్సి.. రొనాల్డోతో పోలిస్తే కొన్ని మెట్లు పైకెక్కేశాడు. క్లబ్ ఫుట్‌బాల్‌లో ఎన్ని ఘనతలు సాధించినా.. ఫుట్‌బాల్‌లో అత్యున్నతం అనదగ్గ ప్రపంచకప్‌ను సాధించడమే ఒక ఆటగాడి అంతిమ లక్ష్యం. కాబట్టి ఈ విజయంతో మెస్సి కెరీర్ పరిపూర్ణం అయింది.
మెస్సి.. అచ్చం సచిన్ లాగే!
క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన సచిన్, ఫుట్‌బాల్ ఆల్ టైం గ్రేట్స్‌లో ఒకడైన మెస్సిల ప్రపంచకప్ విజయాల్లో పోలికలుండడం విశేషం. క్రికెట్లో సచిన్ పదో నంబర్ జెర్సీని ధరిస్తే.. ఫుట్‌బాల్‌లో మెస్సిది కూడా అదే నంబర్ జెర్సీ. 2003లో వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమితో నిరాశ చెందిన మాస్టర్.. ఎనిమిదేళ్ల తర్వాత 2011లో ప్రపంచకప్‌ను అందుకున్నాడు. 2014లో ఫైనల్లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న మెస్సి.. ఎనిమిదేళ్లకు ఇప్పుడు కప్పును సొంతం చేసుకున్నాడు. 2011 ప్రపంచకప్ సెమీస్‌లో సచిన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకుంటే.. 2022 ప్రపంచకప్‌లోనూ మెస్సి సెమీస్‌లో 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలవడం విశేషం. వేర్వేరు క్రీడల్లో అత్యుత్తమ ఆటగాళ్లుగా పేరున్న ఇద్దరి మధ్య ఇలాంటి పోలికలుండడం విశేషమే.
ఇవీ చదవండి: నా రిథమ్‌పైనే దృష్టిపెట్టా.. దూకుడుగా బౌలింగ్ చేశా: కుల్‌దీప్
IPL మినీ వేలానికి ఆ టీమ్ఇండియా సీనియర్ ప్లేయర్లు దూరం.. ఎవరెవరంటే?