భారత మహిళా ఆర్చర్ దీపిక కుమారి టోక్యో ఒలింపిక్స్ కోసం బుధవారం జరిగిన టెస్ట్ ఈవెంట్లో కాంస్య పతకం గెలుచుకొంది. రెండో సీడ్ 18 ఏళ్ల కొరియన్ అమ్మాయి ఆన్సాన్పై వరుస సెట్లలో 6-0తో పరాజయం పాలైంది నాలుగో ర్యాంకర్ దీపిక. ఫైనల్లో దీపికను ఓడించిన ఆన్‌సాన్ పసిడి సొంతం చేసుకొంది. మూడో స్థానంలో నిలిచిన తైవాన్ ప్లేయర్ 'టాన్ యా టింగ్' కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.
" ఫైనల్లో అనుకున్నట్లే రాణించినా ఆన్సాన్ను అందుకోలేకపోయా. ఆటలో పరిణితి సాధించడమే మెరుగైన స్కోరు సంపాదించేందుకు ఉపయోగపడింది. ఈ ఓటమి నాకు మరింత అనుభవం నేర్పింది. నేను మరింత నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాను. కచ్చితంగా టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటతాను".
-- దీపిక కుమారి, భారత ఆర్చరీ క్రీడాకారిణి
భారత మహిళల ఆర్చరీ జట్టు ఈ టెస్ట్ ఈవెంట్లో బాగా నిరాశపరిచింది. ఒక్కరూ అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఫలితంగా వచ్చే ఏడాది జరగనున్న ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు మరింత కఠోర సాధన చేయాల్సి ఉంది. దీనిపైనా దీపిక మాట్లాడింది.
" ఇక్కడ ప్రదర్శించిన ఆటతీరును మరింత మెరుగుపరుచుకుంటే కచ్చితంగా ఆర్చరీ జట్టులోని వారంతా ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాం" అని ధీమా వ్యక్తం చేసిందీ మాజీ ప్రపంచ నెంబర్1.
ప్రస్తుతం 'రెడీ... స్టెడీ... టోక్యో టెస్ట్' పేరుతో జులై 11 నుంచి జులై 18 వరకు ఈ ఆటలు జరుగుతున్నాయి. 2020 టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్‌కు ముందు జరుగుతున్న పెద్ద అంతర్జాతీయ టోర్నీ ఇదే.
గతంలో 2010 కామన్వెల్త్ క్రీడల్లో పసిడి సహా ప్రపంచ ఆర్చరీ వరల్డ్‌కప్‌లో 7 సార్లు ఫైనల్ చేరి... 3 బంగారం, 3 వెండి పతకాలు దేశానికి అందించింది. 2011, 2015లో జరిగిన ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ల్లో 2 వెండి పతకాలు సాధించిందీ టాప్ టార్చర్.
ఆసియా ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటాల్సిందే...
కోటాలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయింది భారత మహిళా ఆర్చరీ జట్టు. టాప్ ఆర్చరీ క్రీడాకారిణి బొంబ్యాల దేవి రెండో రౌండ్లో మలేషియా అమ్మాయి నూర్ అలియా చేతిలో ఓటమిపాలైంది. చివరి వరకు పోరాడినా టై బ్రేకర్‌లో ప్రత్యర్థి విజయం సాధించింది. కోమలికా తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది.
పురుషుల క్యాటగిరీలో భారత స్టార్ ఆర్చరీ క్రీడాకారుడు అతను దాస్ రెండో రౌండ్లో కొరియా ఆటగాడు బే జెహ్యోన్పై 4-6తో ఓటమిపాలయ్యాడు. తరుణ్‌దీప్, ప్రవీణ్ జాదవ్ ద్వయం తొలిరౌండ్లోనే నిరాశపరిచారు.
నవంబర్ 21 నుంచి 29 వరకు బ్యాంకాక్‌లో జరగనున్న ఆసియా ఛాంపియన్‌షిప్‌లో విజయం సాధిస్తే వీరందరికీ 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత లభిస్తుంది.